నడక - నడత
“నడవండి. నడవండి. ముందుకో వెనక్కో పక్కకో నడవండి. పైకో కిందికో నడుస్తూనే ఉండండి. మీతో ఎవరొస్తే వాళ్ళతో నడవండి. ఎవరూ రాకపోయినా మిమ్మల్ని వెంబడించడానికి మీ నీడ ఉందని మర్చిపోకుండా నడవండి. అలా నడుస్తూ నడుస్తూ వుంటే ఏదో ఒక సందర్భంలో నడకనేది మనం నడవకపోయినా ముందుకు సాగుతూనే ఉంటుందని తెలుస్తుంది. మనకు తెలియకుండానే మనల్ని ముందుకు తీసుకువెళుతుందని అర్థమౌతుంది. అప్పుడు మీరు కూర్చున్నచోట, నుంచున్నచోట పనిచేస్తున్నచోట కూడా నడవగలుగుతారు. చివరికి పడుకుని గాఢనిద్రలో కూడా నడవగలుగుతారు. ఆ నడక మిమ్మల్ని మీ అంతర్లోకాల్లోకి తీసుకు వెళ్తుంది. స్వగతాన్నించి గతంలోకీ ఆగతంలోకీ కూడా తీసుకువెళుతుంది.
ఇవన్నీ జరగాలంటే మన కాళ్ళు నేలమీద ఉండాలి. అప్పుడుగానీ మనిషికీ మట్టికి సంబంధం ఏమిటో అర్థం కాదు. మట్టి లేకుండా మనిషుండడు. అందుకే మనిషిలోంచీ బయటకొస్తుంది మట్టి. ఏ భుజంమీదో చేత్తో నలుచుకుని చూడండి. కాసేపటికి నలుగుపెట్టినట్టు వస్తుంది మట్టి. ఎక్కడినించొచ్చిందా నలుగు? దాని గురించి తెలియాలంటే ముందు మన కాళ్ళకి పట్టిన సాక్సునీ వాటిని చుట్టిన బూట్సునీ పీకి పారెయ్యాలి. ఉట్టికాళ్ళతో నడవాలి. మట్టిలో నడవాలి. మట్టితో నడవాలి. చివరికి మట్టయ్యాక కూడా నడుస్తూనే ఉండాలి. ప్రకృతి అంటేనే ప్రకృష్టమైన "కృతి” అని అర్థం. అంటే సర్వోత్తమమైన సృష్టి. అంటే మన జీవన కావ్యమే అని అర్థం. ఇంతకంటే అందంగానూ కవితాత్మకంగానూ ప్రకృతిని ఏ ప్రపంచభాషైనా నిర్వచించగలదా?”
ప్రకృతి ఆశ్రమం గురువుగారు నడకని ఆధారంగా చేసుకుని మనిషికీ మట్టికి గల అనుబంధాన్ని తెలియజేస్తున్నారు. ఆయన మాటలు వింటుంటే..................