ఏది ఏమైనా ఆలస్యంగా విద్యావ్యవస్థలోకి చేరిన దత్తయ్య, అంతకు ముందు ప్రకృతితో, జీవాలతో మమేకమైన శక్తితో తొందరగా సాహితీరంగంలో తనదైన యోగదానాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. పుట్టి పెరిగిన వాతావరణాలను, గ్రామీణ ప్రాంతాలలో కుల వృత్తులవారి సమస్యలను చిన్నవయస్సునుండి అధ్యయనం చేసాడు. మహాభారతంలోని సంవాదాంశాలను పరిశీలించి త్వరలో డాక్టర్ కాబోతున్న దత్తయ్య సంప్రదాయ సాహిత్యం మీద మాత్రమే కాకుండా ఆధునిక సాహిత్యం పైన, సామాజిక సమస్యలపైన, వాదవివాదాల పైన కూడా బాగా అవగాహనను పెంచుకున్నవారు.
-డా. సాగి కమలాకర శర్మ
'తెలంగాణ బి.సి.వాద సాహిత్యం' అనే పుస్తకం 'ఒక చిన్న ప్రయత్నం' అని దత్తయ్య వినయంగా విన్నవించుకున్నాడు. కాని ఇది చిన్న ప్రయత్నమేమి కాదు. పెద్ద సాహసమే చేశాడు. ఎంతో ఓపికగా బహుజన సాహిత్యాన్ని సేకరించి ప్రక్రియల వారిగా పరిశీలించడంతో ఒక స్పష్టత వచ్చింది. భవిష్యత్తులో ఇది బి.సి.వాద సాహిత్యంలోని ఖాళీలను పూరించడానికి అవసరమైన సృజనాత్మక, పరిశోధనాత్మక వేదికగా రూపొందుతుంది. బహుజనుల సంస్కృతిపై, రచనలపై థాట్ పోలీసింగ్ చేసే ఆధిపత్య విమర్శకులు, కుహనా మేధావులు, స్వయం ప్రకటిత సామాజిక ఉద్యమనాయకుల మైండ్ మ్యాపింగ్ కుట్రలను ఎదుర్కోవలసిన సమయం ఇదే.
- డా.ఎస్.రఘు