ఆంధ్ర, తెలుగు అనే పదాలు జాతిపరంగా భాషాపరంగా, దేశపరంగా వాడబడినట్లు తెలుస్తున్నది. అయితే ప్రస్తుతం 'ఆంధ్ర' అనే పదం దేశపరంగా అంటే భూభాగాన్ని వివరించటానికి ఎక్కువగా వాడబడుతుండగా తెలుగు అనే పదం తెలుగుభాష మాట్లాడే వారికి, తెలుగు జాతివారికి వాడబడుతున్నది. 'ఆంధ్ర' అన్నప్పుడు ఆ ప్రాంతంలో వివిధ భాషలు మాట్లాడే వివిధ జాతులవారు ప్రస్తావనకు వస్తారు. 'తెలుగు' అన్నప్పుడు తెలుగుభాష మాట్లాడుతూ, ఆయా ప్రాంతాల్లో ఉండేవారు స్ఫురిస్తారు. దీన్నిబట్టి 'ఆంధ్ర' అనేది రాష్ట్రానికి (ప్రాంతానికి 'తెలుగు' అనేది భాషకు బహుళంగా వాడబడుతున్నట్లు గ్రహించవచ్చు.
ఆంధ్రదేశానికి సరిహద్దు రాష్ట్రాలుగా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలున్నాయి. ఐదు రాష్ట్రాల మధ్య ఉండడంవల్ల ఆంధ్రదేశం అనేక సంస్కృతుల కూడలిగా ఉన్నది. అందుకే 'ఆంధ్ర'ను ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాలకు సేతువుగా చెబుతారు.
ఆంధ్రరాష్ట్రంలో, తెలంగాణాలో నివసిస్తూ తెలుగుభాషను మాట్లాడుతూ జనపదాల్లో అంటే పల్లె ప్రాంతాల్లో నివసిస్తూ, పట్టణాల్లో నివసించిన జానపద భావన కలిగిన వారంతా తెలుగుదేశపు జానపదులేనని చెప్పవచ్చు. వీరు తమ వినోదం కోసం సృష్టించుకొన్న ప్రదర్శన కళలే తెలుగు జానపద ప్రదర్శన కళలు. పల్లె ప్రజల భావాలకు ప్రతిబింబాలైన ఈ కళలను ప్రదర్శించటానికి రంగస్థలం తప్పకుండా కావాలి. అయితే అన్ని కళలను రంగస్థలం మీదనే ప్రదర్శించటం జరగదు. కొన్ని ప్రదర్శన కళలు రంగస్థలం మీద ప్రదర్శించబడితే, మరికొన్ని దేవాలయాల ముందుగానీ, ధనవంతుల ఇళ్లముందుగానీ, రోడ్ల కూడళ్లలోగానీ, వీధుల్లోగానీ ప్రదర్శించబడతాయి. ఈ విధంగా ఆయా కళలు ప్రదర్శించబడే ప్రాంతాన్ని కళారంగంగా భావించవచ్చు.
'రంగము' అనే శబ్దానికి నాట్యస్థానం, నాట్యం, గుంపుగల చోటు, ఆనందం అనే అర్ధాలున్నాయి. ప్రదర్శన కళారంగం అన్నప్పుడు ఆయా రీతుల్లో ప్రదర్శించబడే నాట్య................