నేను ఇప్పుడీ కొట్టంలో వొక మూల పడి వున్నాను. నేను ఇక్కడ ఈసురోమని పడి వున్నాననే సంగతి యెవ్వరూ గమనించరు. నా చుట్టూ వున్న ఈ రొచ్చూ, నా శరీరం మీద వున్న ఈ గోమార్లూ చూశారా? అంతే- చుట్టూ కొంచెం బాగు చెయ్యాలని గానీ, చచ్చేదాకా నా వొళ్లు వీలున్నప్పుడల్లా శుభ్రపరచి నా చావు సుఖవంతం చెయ్యాలని గానీ ఎవ్వరికీ పట్టదు. పైగా చావకుండా ఇంకా ఇక్కడే వున్నానని నా యజమాని మొదలు ఇంటిల్లిపాదీ విసుక్కుంటూ ఉంటారు. నాకు త్వరగా చచ్చిపోవాలనే ఉంది. ఏం చెయ్యనూ? నాకు చావు రాకుండా ఉంది. నన్ను గురించి ఈ మాటే అంటూ ఉంటాడు, బక్క చిక్కి కుక్కి మంచంలో కూర్చుని వుండే నా యజమాని తండ్రి కూడా! ఆ సంగతి తరువాత చెపుతాను.
మెడలోని గంటలను గణగణ మోగించుకుంటూ ఠీవిగా మేత మేస్తున్న ఆ ఎద్దులను చూశారా? మా యజమానికి ఆ ఎద్దులంటే అమిత ప్రేమ. వాటికి జనప కట్టలూ, పచ్చగడ్డి, ఉలవలూ అన్నీ పెడతాడు. పడుకున్నప్పుడు వాటి వంటికి ఎక్కడ గలీజు అంటుకుంటుందోనని ముప్పూటలా శుభ్రం చేస్తాడు. తన సొంత చేతులతో వాటి వొంటిని రోజూ మాలిష్ చేసి నిగనిగలాడేటట్లు ఉంచుతాడు. ఊళ్ళో అందరికీ వాటిని చూపి గర్వపడతాడు.
కాని ఈ మూలపడి ఉన్న నా సంగతి మాత్రం ఆలోచించడు. నా ముందు గడ్డి..............