తెనాలి రామకృష్ణుడు : సూర్యుడు, చంద్రుడు లేని ఆకాశాన్ని ఊహించుకోలేం. అలాగే కొంతమంది మహా కవులు లేని తెలుగు సాహిత్యాన్ని ఊహించుకోలేం. అటువంటి మహాకవులలో తెనాలి రామకృష్ణుడు ఒకడు. 'పాండురంగ విభుని పదగుంఫనంబు' అను కితాబు పొందిన ఈ కవి రామలింగడు అను మరొక పేరుతో చాటు పద్యాలలో, కథలలో పండిత లోకంలోనే కాదు- పామర జనులలో కూడా ప్రసిద్ధుడు. ఇతడు కవిత్వమనెడి తియ్య మామిడి చెట్ల వరుసకు వసంతకాలము వంటివాడు.వేడుక కలిగిన మంచి మాటలకు గని. సరసమైన కథల చిక్కుముడులను విప్పగల ప్రతిభావంతుడు. కుమార భారతి బిరుదాంచితుడు. తెనాలి రామకృష్ణుడు శైవునిగ ఉన్నప్పుడు ఉద్భటారాధ్య చరిత్ర, వైష్ణవునిగా మారిన పిదప ఘటికాచల మాహాత్మము పాండురంగ మాహాత్మములు వరుసగా రచించాడని పెద్దల మాట. ఈ గ్రంథాలు మాత్రమే ఇప్పటికి లభిస్తున్నాయి. అతడు రచించినట్లుగా చెబుతున్న కందర్పకేతువిలాసము, హరిలీలా విలాసములలోని కొన్ని పద్యాలు మాత్రమే పరిశోధకులకు లభించాయి.
మానవీయ విలువలను దైవీ సంబంధమైన గ్రంథాలలో పొందుపరచిన అపురూప కవి రామకృష్ణుడు.. తన రచనలలో తను నమ్మిన దానిని ఖచ్చితంగా చెప్పాలనే తపన, స్టైర్యం కనిపిస్తాయి. సంప్రదాయాన్ని తన రచనలలో చాలావరకు పాటించినా, అవసరమైన సందర్భాల్లో తనకు తానుగా భాషా స్వాతంత్ర్యం మొదలైనవి తీసుకొన్నాడు. డా. తాడేపల్లి పతంజలి : 1963 జులై 15 వతేదీన జన్మించారు. భాషాప్రవీణతో పాటు ఎంఏ పట్టాన్ని ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి పొందారు. 'చెరువు సత్యనారాయణశాస్త్రి సృజనాత్మక రచనలు - అనుశీలనము' అను అంశముపై పరిశోధన చేసి తెలుగు విశ్వవిద్యాలయము నుండి డాక్టరేట్ పట్టా పొందారు. అన్నమాచార్య సాహిత్యంలో కృషి చేసి యూజీసీ వారికి మైనర్ రీసెర్చి ప్రాజెక్ట్ సమర్పించారు. 60 వారాల పాటు ఒక ప్రసిద్ధ తెలుగు దినపత్రికలో అన్నమయ్య కీర్తనలను సులభతర శైలిలో పరిచయం చేసి లబ్ధ ప్రతిష్ఠులయ్యారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పరిశోధనాపత్రాలు సమర్పించారు. కవి, కథా రచయిత అయిన వీరు ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలోని సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రాచార్యులుగా పని చేస్తున్నారు. అన్నమయ్య అన్నమాట, అన్నమయ్యగీతోపదేశాలు, భవిష్యపురాణము, శ్రీమన్నారాయణీయము, భావనలు, మామాకలాపం,నాటి భారతంలో నేటి సమాజం, ప్రాచీన ప్రబంధం - ఆధునిక సంతకం, అన్నమయ్య కౌముది, శ్రీశివ మంగళాచరణ సురబి, అన్నమయ్య పదం పరమార్థం, నమక చమకాలు -అర్థ విశేషాలు, చెరువు సత్యనారాయణ శాస్త్రి లింగోద్భవ స్తుతి, శ్రీ విష్ణుదేవ కర్ణామృతం, శ్రీ రాజోపచార పూజా కల్పం, శ్రీ అరుణాచల మణమాల, శ్రీ పుర కమలాంబికా నవావరణ కృతులు ముద్రణ పొందిన వీరి రచనలు. జాతీయ స్థాయిలో ఆకాశవాణి ఉత్తమ హాస్య రచయిత అవార్డు(1996), రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అధ్యాపక అవార్డు(2010) పొందారు.