అనువాదకురాలి మాట
అనువాదం ఎప్పుడూ సంక్లిష్టమే! మూల భాష నుండి లక్ష్య భాషలోకి అనువాదం కత్తి మీద సామే! ఇప్పటికి కొన్ని అనువాదాలు కన్నడ నుండి తెలుగుకు చేశాను. నవలానువాదంలో ఈ ప్రయత్నం రెండవది. మొదటి అనువాదం గీతానాగభూషణ రాసిన బతుకు నవలను అదే పేరుతో అనువదించాను. ఇప్పుడు తేరు పేరుతో శ్రీ రాఘవేంద్ర పాటిల్ (2003) రాసిన నవలను అదే పేరుతో అనువదించాను. ఈ రెండు కన్నడ నవలలు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన రచనలే. రెండూ భిన్న ప్రాంతాలకు సంబంధించినవి. భిన్న సంస్కృతులకు సంబంధించినవి. మరీ ముఖ్యంగా రెండు నవలలు మాండలికంలో రాయబడ్డాయి. బతుకు నవల కలబురిగి మాండలికమైతే, తేరు బెళగావి ప్రాంత మాండలికం. భిన్న కోణాలతో, భిన్న రీతులలో సాగే నవలలు. అందుకే ప్రతీ సారి అనువాదం కొత్తగా ఉంటుంది. ప్రతీ అనువాదానికి ప్రసవ వేదన తప్పనిసరి. రివాజుగా సరి కొత్త అనుభవం, అనుభూతి కలుగుతాయి.
మూల భాషలో నవల చదువుతున్నప్పుడు కలిగే భావోద్వేగం, సన్నివేశాలు దృశ్యమానమవుతున్న తీరు, పాత్రల ఔన్నత్యం, హృదయాన్ని కరిగించే సందర్భాలు, అట్టడుగు వర్గాల అమాయకత్వం, ఆ అమాయకత్వాన్ని, మూర్ఖత్వాన్ని ఆసరాగా తీసుకుని దోపిడీ చేసే బూర్జువా వ్యవస్థ, కాలక్రమేణా సమాజంలో వస్తున్న చైతన్యం, ఆ చైతన్యంతో తిరుగుబాటు చేసే అట్టడుగు వర్గాలు వంటి ఎన్నో విషయాలు ఈ నవలలో పాఠకుణ్ణి ఆలోచింపచేస్తాయి.
తేరు-నవల బెళగావి ప్రాంతంలోని ధర్మనట్టి అనే గ్రామం ప్రధానంగా, చుట్టు పక్కల ఉన్న కళ్ళొళ్ళి, తనగ, గోగికొళ్ళ, గోకాక్, ఉదగట్టి, సొగల, మునవళ్ళి, శబరికొళ్ళ, నవిలుతీర్థ, కళ్ళీగుద్ది, మలప్రభ నది, ఘటప్రభనది, కృష్ణా నదులు చుట్టూ సాగుతుంది. ప్రధాన కథ మొదటి భాగంలో జానపద కథాగేయ రూపంలో జానపద వృత్తి గాయకుల పాడుతున్న పాటతో (సుమారు 41 పుటల గేయం) వివరింపబడుతుంది. జానపద కథా గేయం ద్వారా ఇతివృత్తం పరిచయం కావడం క్లిష్టమైన మార్గం! జానపద కథాగేయం ద్వారా కథను అందిస్తూ, అనుసంధానిస్తూ, అన్వయిస్తూ తీసుకెళ్ళడం సులభం.......................