మొదటి భాగం
-1-
పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలోని సంఘటిత ఉద్యమాల ప్రాంతం, విప్లవాల పురిటిగడ్డ, వీరమాతల నిలయమైన బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీలో తేదీ 31-12-2017 నాటి రాత్రి ఎనిమిది గంటల యాల్లకు తన 90వ ఏట కామ్రేడ్ గజ్జెల లక్ష్మమ్మ చనిపోయింది. లచ్చవ్వ అమరురాలైనట్లు తెలిసి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కొడుకులు, కోడండ్లు, మనుమలు, మనుమరాండ్లు, రక్త సంబంధీకులు, బంధువులు కన్నాల బస్తీలోని అవ్వ ఇంటికి చేరుకున్నరు. హైదరాబాద్, హన్మకొండ, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ లాంటి జిల్లాలు, పట్టణాల నుంచి అవ్వ భౌతిక కాయాన్ని ఆఖరిసారిగా చూసుకుని నివాళులర్పించేందుకు విప్లవాభిమానులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు కన్నాల బస్తీకి చేరుకున్నరు. అందరితోపాటు వార్త తెలువగానే నేను నా సుఖదుఃఖాల వొడి, నా పాఠశాల అవ్వ ఇంటికి మా అందరి ఇంటికి చేరుకున్నాను.
అలా వచ్చిన వారిలో విప్లవ రచయితలు, అమరుల బంధు మిత్రుల సంఘం, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక, పౌరహక్కుల సంఘం, తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకులు, కార్యకర్తలు వచ్చిండ్లు. విప్లవ సంస్థల్లో పనిచేసి సరెండరై సాధారణ జీవితం గడుపుతున్నవాళ్లు, జర్నలిస్టులు, బూర్జువా, వామపక్ష పార్టీల, ఎంఎల్ పార్టీల నాయకులూ వచ్చిండ్లు. అమరుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, విప్లవాభిమానులు ఎందరెందరో కన్నాల బస్తీకి చేరుకున్నరు.
అవ్వ ముఖాన్ని కడసారిగా చూసుకోగల్గుతానో లేదోనంటూ ఆలస్యమైనోళ్లు తేప తేపకు మొబైల్ ఫోన్లలో తెల్సుకుంటూ అదుర్దాతో అంతిమ దర్శనానికి చేరుకున్నరు. వీల్లందరిని చూడడానికి, ఎవరెవరు వచ్చిండ్లో తెలుసుకోవడానికి సివిల్ దుస్తుల్లో సిఐడి పోలీసులు వచ్చిండ్లు.
2018 జనవరి 1నాటి మధ్యాహ్నం మూడు గంటల యాల్లకు విప్లవ సాంప్రదాయాలు, ప్రజల సాంప్రదాయాలు కలగలిసి అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. వాకిట్లో పాడె తయారైంది. కొందరు మహిళలు అవ్వకు స్నానం చేపించి కొత్తదైన తెల్లబట్టలో చుట్టిండ్లు. నేను తయారు చేసిన ఎర్రజెండాలను పాడెకు నలువైపులా కట్టిండ్లు. డప్పులు మోగుతున్నయ్. బల్లమీది నుంచి పాడెమీదకు మార్చేందుకు అవ్వను లేపడంతో రక్తసంబంధీకుల ఏడ్పులు పెరిగిపోయినయి. పాడెపై పడుకోబెట్టిన అవ్వ భౌతికకాయంపై ఎర్రగుడ్డను కప్పిండ్లు, పూల దండలు వేసిండ్లు.
జోహర్ కామ్రేడ్ గజ్జెల లక్ష్మవ్వ...
జోహర్. జోహర్...............