రేచల్
శుక్రవారం, 5 జులై 2013
ఉదయం
ట్రెయిన్ ట్రాక్ పక్కన ఒక దుస్తుల కుప్ప ఉంది. లేత నీలంగుడ్డ. బహుశా ఒక చొక్కా అయ్యి ఉంటుంది. మరేదో మాసిన తెల్లని గుడ్డతో లుంగచుట్టి ఉంది. బహుశా పనికిరాని పాత గుడ్డలయి ఉంటాయి. కట్ట పక్కన పెరుగుతున్న తుప్పలలోకి విసిరేసినట్లున్నాయి. ట్రాక్ మీద ఈ భాగంలో పనిచేస్తుండే ఇంజినీర్లు వేసి ఉంటారు. వాళ్లు ఎప్పుడూ ఇక్కడే ఉంటారు. కాదంటే మరేదో అయ్యుండవచ్చు. నేను ప్రతి విషయం గురించి అతిగా ఆలోచిస్తానని అమ్మ అంటుండేది. టామ్ కూడా అదే అన్నాడు. నేనేం చేయగలను. ఆ పడేసిన గుడ్డలు కనబడతాయి. మురికయిన టీషర్ట్, లేదా ఒకే ఒక షూ. ఇక నాకు ఆలోచనకు వచ్చేదల్లా మరొక షూ. వాటిని తొడుక్కున్న కాళ్లు.
ఒక్క కుదుపుతో కిరకిర లాడుతూ తిరిగి కదలసాగింది. ఆ గుడ్డలు కనిపించకుండా పోయినయి. మేం లండన్ వేపు సాగుతున్నాము. జాగింగ్ వేగంతో, నా వెనుక సీటులో ఎవరో చికాకుపడి నిస్సహాయంగా నిట్టూర్చారు. ఆష్బరీ నుంచి యూన్ వెళ్లే ఈ 8.04 స్లో ట్రెయిన్ ఎంత అనుభవంగల ప్రయాణికులకయినా ఓపికకు పరీక్ష పెడుతుంది. ప్రయాణం లెక్క ప్రకారం యాభై నాలుగు నిమిషాల్లో ముగియాలి. కానీ ఎప్పుడూ అది జరగదు. ట్రాక్లో ఈ భాగం ప్రాచీనమయినది.................