వ్యాసాలు :
స్వతంత్ర భారతంలో స్వర్ణ సంక్రాతి వేడుకలు
అయిదు సంవత్సరాల, అనుభవించరాని, బానిసత్వపరాభవానల నరకం నుంచి బయల్పడి సుడిబడిపోయిన ప్రాణాలు స్వతంత్రవాయు సంసర్గంతో కోల్కొని రేకెత్తి బ్రతికి లేచిన ఈ జాతి, పసిడికాంతుల పంటసిరిని ప్రాంగణానికి తెచ్చుకుని తొలిసారిగా నేడు సంపూర్ణ స్వాతంత్య్ర విజయోత్సాహాలతో, స్వర్ణసంక్రాంతి వీరపూజ మహోత్సవాలు, నెరపు కుంటున్నది.
ఈ శుభోత్సావాసమయ సంక్రమణానికి ఈ జాతి యెన్నెన్నో మహాత్యాగాలు చేసింది. కణకణలాడే ఉష్ణరక్తాలను కదనరంగాల్లో కాసారాలుగా ఒలికించుకుంది. ప్రళయనటుని కాలి అందెలో విలయం భయదంగా శబ్దిస్తుంటే పచ్చిగుండె లెన్నెన్నోకోసి, బలిగా రుద్రభూముల మీదికి విసిరేసింది. ఆరని చారలుగా వారలుబోసి, సాగాలంటే పడుచువాళ్లు ఉష్ణరక్తమే జలధారలు చేసేసి జయలక్ష్మి పసిడి పాదాలు, తామరతంపరగా తడిపివేసింది. ఈ మహాత్యాగసౌపాన పరంపర నొకటొకటే అధిగమించి స్వతంత్ర స్వర్ణ పథ సంక్రమణంచేసి నేడే తొలిసంక్రాంతి వీరపూజలు, మహోత్సవంగా నెరపుకుంటున్నది.
కడచిన సంక్రాంతినాటికే స్వాతంత్య్ర లబ్ది సమకూరిన నాడు చెలరేగిన ఆ బీభత్సకాండలో ఉత్సవ సంరంభాలకు అవకాశమే లేకపోయింది. ఆ శిశుహత్యలూ ఆ జీవసంక్షోభం, ఆ మానవతుల మానభంగాలు ఆ మతోన్మాద, మదోన్మాద పైశాచిక వికటతాండవాలలో పండగ పబ్బాలని గడప పచ్చచేసుకునే ప్రాప్రేముంది.
అందాలు చిందులాడే కాశ్మీరపులోయల్లో మాణిక్యాల పంటలుగా విరయబూసిన ఆ కుంకుమపూలతోటలన్నీ మానవ రుధిరాభిషేచనంతో పిశాచాలు పిండాలు నమిలే పలల భూములుగా పరచుకొని బీభత్సరుధిదారుణమౌతున్నాయ్ ఆసేతు శీతనగర పర్యంతం, సంస్థానాధీసులంతా నరేంద్ర మండలిని పునరుద్ధరించాలనే దురాకాంక్షతో, కస్సుకస్సున పడగలు విప్పి కోడెత్రాచుల్లా నాల్కలు కేరుతూ తోకలమీదలేచి విషాలుకక్కుతూ................