కొత్తమనుషులు :
జయ్ హింద్
“జయీంద్! ఈవేళ నిజంగా సుదినం మహాసుదినం పర్వదినం; మహానాయకుల దర్శనం లభించి జన్మ తరించిపోయింది; చిన్నప్పటి నుంచీ యెన్నెన్నో మహాపుణ్యాలూ, అనేక రకాల దేశసేవా చేసుకున్న కారణంచేత ఈరోజు ఇలాంటి మహద్భాగ్యం లభించింది; నేనొక్కణ్ణి కాదు - మా అమ్మా, నాన్నా, మా తాత ముత్తాతలు, ఇకా ఆపైనుంచీ తరతరాలవాళ్ళూ, అనేక గుళ్లూ గోపురాలూ కట్టించి, అనేక దానధర్మాలు చేసివున్నట్టు ప్రతీతి; తరతరాలనుంచీ వస్తూన్న ఇంత మహాపుణ్యమూ, ఇలా తెగ పేరుకుని వున్న కారణంచేతనే తమవంటి మహామహుల దర్శనమంటూ లభించటానికి అవకాశమంటూ కలిగింది. తమరంటే ఏవిటి మరి? సామాన్యులా? దొడ్డ ప్రభువులు, మహామహులు, స్వాతంత్య్ర రథసారథులు, అహింసా సంస్థాపనోద్యమ నిర్ధామధూములు, హరిజనోద్ధరణదీక్షాదక్ష దక్షిణపాణి పంకేరుహులు, పునర్నిర్మాణం వగైరా - ఇంకా యిప్పుడు జ్ఞాపకం రాకుండావున్న అనేకరకాల కార్యకలాపాలను నిర్వహించుతూ, (రాట్న) చక్రం తిప్పుతున్న మహామహులు, చండశాసనులు అనేక ప్రత్యర్థి రాజకీయ నాయకుల తలగొండు గండలు, శతసహస్ర ప్రభుత్వోద్యోగ వితరణైకచణ వామకరన్యస్త సువర్ణకంకణ - (దయవుంచి కొంచెం ఆగండి సమాసం పూర్తిచేస్తాను) గణగణరణత్ ఘంటి కానిసదపులకిత సర్వసమాశ్రిత జనకళేబరులు, మహామహులు, దొడ్డ ప్రభువులు ఇంకా యేవిటో - దీందుంపతెగా బుర్ర సరిగా పనిచేసి యేడవటంలేదు - జ మహాప్రభూ! వీరాధివీరా, వీర ప్రతాపా! పసిడితకిలీధారీ! పరమధర్మ ప్రసారీ! ఖద్దరు ధారీ! కాంగ్రెస్ భేరీ! పాహిమాం, పాహిమాం! జహీహింద్!" - అంటూ, నట్టునట్లుగా, పెద్ద పొడుగాటి దండకమోటి చదివేసి, ఆ క్రొత్తఖద్దరు 'కాషాయ రమ్యవల్కల హుతాశనశిఖా సంపిహితాశ్వర్ధసామిధేని' అమాంతం పైపంచతీసి, హుటాహుటి నడుంబిగించి, దబదబా చెంపలు వాయించుకుంటూ, శాయన్నారావు పంతులుగారి ముందు సాష్టాంగంపడి, గతుక్కున నేలకరుచుకున్నాడు................