తూర్పు - పడమర గురించి
ఇంగ్లీషుతో సహా వివిధ భాషలలో ప్రాచుర్యం పొందిన కథలను తెలుగు పాఠకులకందజేయాలన్న కోరికతో నేను చదివిన మంచి కథలను తెలుగులోకి అనువదించి, పత్రికలకు పంపడం, అవి ప్రచురణ పొందడం జరిగింది. 1988 నుండి అనువాదరంగంలో ఉన్నాను. ఈ కథలను ఆదరించి ప్రచురించిన 'విపుల' మాసపత్రిక, సాక్షి దినపత్రిక 'ఫన్డే' సంపాదకులకు, సిబ్బందికి, యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ఈ కథలను భద్రపరచకపోవడంతో, వీటిని సేకరించడానికి చాలా వ్యయప్రయాసలకోర్చ వలసి వచ్చింది. ఈ కథల సేకరించడంలో నాకెంతగానో తోడ్పాటునందజేసిన శ్రీ శ్యామనారాయణ (గుంటూరు) గారికి, మనసు ఫౌండేషన్ రాయుడు గారికి, అనువాదానికి మంచి కథలు సూచించిన వెంకట్ మరియు మా స్నేహితుల గ్రూప్ సభ్యులకు వేయిన్నొక కృతజ్ఞతలు.
హాస్యము, కరుణ, ఉత్కంఠ, శాంత రసాలతో నిండిన ఈ కథలలో మానవీయ ధోరణులనూ, వివిధ భాషల ప్రజల సహృదయత, సౌభ్రాతృత్వాలనూ, సంస్కృతి, అలవాట్ల గురించి మనం తెలుసుకోవచ్చు. 'భామ' కథలో భామ వంటి పల్లెటూరి గృహిణి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మూలిక వైద్యుడి పట్ల చూపిన కరుణ, వాత్సల్యాలనే 'ఆకుపచ్చ తలుపు' కథలో రూడాల్ఫ్ స్టీనర్ మూడు రోజుల నుండీ ఆహారం లేకుండా ఉన్న పేదయువతి పట్ల చూపడం మనం గమనించవచ్చు. అలాగే పుట్టు వ్యసన పరుడైన కెప్టెన్ హృదయం ఒక తొమ్మిదేళ్ల అవిటి అమ్మాయి, అలమటించడం చూసి ఎలా మారిందో కూడా 'కెప్టెన్' కథలో మనం చూడవచ్చు. 'దయ, కరుణ, వాత్సల్యం' వంటి మానవీయగుణాలకు దేశాల........