ప్రస్తావన
జీవన స్రవంతి అవిచ్ఛిన్నంగా సాగిపోతూనే ఉంటుంది. కాలక్రమంలో, సామాజిక జీవన సరళిలో ఏవో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. సంస్కృతి, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు - మొదలైన వాటిలో అనేక అంతరాలు ఏర్పడుతుంటాయి. కరుడుకట్టుకు పోయిన పాత తరం భావాలు, వర్గ విభేదాలు వంటివి సమాజాన్ని పట్టి వీడిస్తున్నప్పుడు, న్యాయానికీ సత్యానికీ, మానవతకూ భంగం వాటిల్లే పరిస్థితులు ఏర్పడినప్పుడు - పాత కెరటాల స్థానంలో కొత్త కెరటాలు ఎగసిపడి వస్తాయి. కొత్త భావాలతో, ఆలోచనలతో, కర్తవ్యనిష్ఠ కలిగిన, భవిష్యత్ప్రష్టలైన మార్గదర్శకులు కొందరు అవతరిస్తారు. వారిది క్రాంతదర్శనం. తమ కాలానికన్నా చాలాముందుకు వెళ్లి చూడగలిగిన మానవీయ దర్శనం అది.
మన దేశంలో 19వ శతాబ్దం చివరి నాటినుండీ, ఇటువంటి నవ వికాసోద్యమం ప్రారంభమై దేశమంతా విస్తరిల్లింది. ముఖ్యంగా మన తెలుగునాట విస్తరించిన మూఢాచారాలని, విశ్వాసాలని ఖండించి, హేతువాదమనే జ్యోతిని వెలిగించి, నిద్రాణమై ఉన్న మానవ జాతిని మేల్కొలిపిన వైతాళికులు ప్రధానంగా చెప్పుకోదగినవారు ముగ్గురున్నారు. వారెవరంటే, వేమన, కందుకూరి, త్రిపురనేని రామస్వామి.
జాతి జీవనంలో జీర్ణించిపోయిన ఛాందస విశ్వాసాలని నిర్మూలించటానికి అక్షరాయుధంతో జీవితమంతా అలుపెరగని పోరాటం చేసిన భావ విప్లవవాది త్రిపురనేని రామస్వామి. సమాజాన్ని మేలుకొలిపి, నూతన భావజాలంతో ఉత్తేజ పరచటం కోసమే ఆయన సాహిత్యాన్ని సృజించారు. ఆనాటి సంఘంలో పాతుకు పోయిన మూఢనమ్మకాలను, ఆచారాలను తన కలం పోటుతో ఖండించిన విప్లవ వీరుడు రామస్వామి. తెలుగు సాహిత్యంలో తొలిగా హేతువాద, విప్లవవాద భావప్రసరణకు పునాదులు వేసిన మహాకవి ఆయన.
అంతేకాదు. సర్వమానవ సమానత్వాన్నీ, సంక్షేమాన్నీ మనసారా కాంక్షించిన మానవతావాది రామస్వామి. సామాన్యునికి న్యాయం జరగాలన్నదే ఆయన తపన, వర్ణ భేదాలులేని ప్రజాస్వామ్య వ్యవస్థను గురించి ప్రజలకు తెలియచెప్పి, నీతికి, మానవతకు పట్టం కట్టిన మహామనీషి రామస్వామి. అసలు హేతువాదమంటేనే ప్రశ్నించే తత్త్వం. ఆ ప్రశ్నించే గుణాన్ని ప్రజలకు నేర్పి, ప్రతి విషయాన్నీ సహేతుకంగా ఆలోచించే పద్ధతిని గురించి ఆయన రచనలు పదే పదే చెపుతాయి. అట్లా హేతువాద మానవతా వాదాలని జనంలో ప్రసారం చేయటం కోసమే ఆయన సాహిత్య సృజన జరిగింది................