పరిచయం :
పోరాటాల పోరుగడ్డ నల్లగొండ జిల్లా. ఎన్నో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డ రణక్షేత్రమది. ఎందరో కవులు, కళాకారులు, రచయితలు, ఉద్యమ నాయకులు, పోరాటశీలురు, త్యాగధనులు ఉదయించి నడయాడిన నేల. తెలంగాణా జిల్లాలలోకెల్ల ప్రజావిప్లవాల కేంద్రంగా పేరుమోసి నిత్యం ఉద్యమ సౌరభాలను వెదజల్లుతుంది. ఆ నేలపై జన్మించి, ఉద్యమ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని, వివిధ ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటూ ఆ అనుభవాలకు అక్షరరూపాన్ని కల్పిస్తున్న సాహితీవేత్త కందిమళ్ళ ప్రతాపరెడ్డిగారు.
కళ కళ కోసం కాదు, సమాజం కోసమని కాంక్షించే కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి రచనలు చేస్తున్న అతికొద్దిమంది రచయితలలో కందిమళ్ళ ప్రతాపరెడ్డిగారు. ముఖ్యులు. కేవలం రచయితగానే కాకుండా నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు నాయకులుగా చరిత్ర పుటల్లో స్థానం పొందారు. వీరి ప్రతి రచనలోనూ కమ్యూనిస్టు భావజాలం సుస్పష్టంగా కనిపిస్తుంది. సామ్రాజ్యవాద భావాలుగల నియంతల ఉక్కుపిడికిళ్ల నుండి విముక్తి పొందడానికి, ప్రజలందరూ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలతో జీవించడానికి ప్రపంచంలో అనేకచోట్ల అనేక ఉద్యమాలు తలెత్తాయి. అన్నింటిలో విలక్షణమైనది తెలంగాణా సాయుధ పోరాటం. ఆ పోరాటంలోని వివిధ దశలను ఆయా పరిస్థితులలో పీడిత, తాడిత ప్రజానీకం చేసిన సాహసాలను, చూపిన మనోధైర్యాన్ని తమ రచనల ద్వారా లోకానికి తెలియజేసిన రచయిత - ప్రతాపరెడ్డిగారు. ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం ఉండటం వల్ల, ఉద్యమం వారి జీవితాన్ని అమితంగా ప్రభావితం చేసినందువల్ల వారి రచనలన్నీ ఉద్యమ భావ చైతన్యంతో అలరారుతున్నాయి. సాయుధ పోరాట జ్ఞాపకాలను నేటితరానికి, భవిష్యత్తరాల వారికి అందజేయడంలో కృతకృత్యులైన రచయిత శ్రీ ప్రతాపరెడ్డిగారనటం అతిశయోక్తి కాదు. వాస్తవికాంశాలను సృజనాత్మక సాహిత్య ప్రక్రియలతో మేళవించి అటు సామాజిక ప్రయోజనాన్ని, ఇటు సాహిత్య ప్రయోజనాన్ని ఏకకాలంలో సాధించారు.
"భరతజాతి బిడ్డలార!
భావిభారత పౌరులార!
కులమతాల కుళ్ళునంత
కడిగేద్దాం ఒక్కటై -
నందనవన మందిరముగ -
నిర్మిద్దాం ఈ దేశం.”