సంభాషణ
వర్షాలు తగ్గుముఖం పట్టి, చలి మెల్లిగా పెరుగుతోంది.
ఒరిగేటి కొండల సమూహం మధ్యలో ఒకానొక కొండవాలున ఉన్న గ్రామమే పర్వతాపురం. ఆ కొండలన్నీ ఒకవైపుకి వాలినట్టు కనిపిస్తాయని అందరూ ఆ పేరుతో పిలుస్తారు. పర్వతాపురం ఊరంతా కలిపితే నూటయాభై గడపలు. ఊరికి చుట్టూ అడవి. చుట్టుప్రక్కల పది ఊర్లకి పర్వతాపురమే పెద్దది. ఆ ఊరి పొలిమేరలో మెయిన్రోడ్డుకి కాస్తంత దూరంలో ఎడంగట్టు అనే చిన్ని గుట్ట ఉంది. ఆ ఎడంగట్టుపై ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. మెయిన్ రోడ్డు నుండి ఎడంగట్టు మీద ఉండే ఆసుపత్రి వరకూ అంతా మట్టి రోడ్డు. ఆ రోడ్డంతా మలుపులతో చిత్రంగా ఉంది. ఆ ప్రాంతమంతా చెట్లతో నిండిపోయి దట్టంగా ఉంది.
రాత్రి సమయం. ఆ మట్టిరోడ్డుపై కిర్రు కిర్రుమంటూ సాగలేక సాగుతున్న సైకిల్ ఆపసోపాలు. దానిపై 15 ఏళ్ళ కుర్రాడు. సైకిల్కి ఉండే రేడియో ఒక్కో మాటని ఆగి ఆగి పలుకుతోంది. సైకిల్ వెనక వైపు రాజయ్య అని తండ్రి పేరూ, దాని క్రిందే చక్రి అని అతని పేరూ రేడియంలో రాస్తున్నాయి. అయినా, అవి ఆ కారుచీకట్లో కనిపించడం లేదు. చుట్టూ చీకటి. అడవిలో దూరంగా శబ్దాలు. నక్కలేమో అని అతని మనసులో భయం. చుట్టూ ఉన్న చెట్ల పైనుండి ఏ ఎలుగుబంటి తనపైన దూకుతుందో అని భయం. జుట్టు నుండి జారి, చెవుల ప్రక్కగా పారుతూ మెడ వంపులో కాలర్ అంచులో మాయమవుతోంది చెమటధార..............