సమధర్మం
తన చరిత్ర తనె పఠించి
ఫక్కున నవ్వింది ధరణి;
తన గాథను తనే స్మరించి,
భోరున ఏడ్చింది ధరణి.
వృద్ధజగతి సమాధిపై సమధర్మం ప్రభవించును ;
నిద్దుర చీకటి వెలుపల వేకువ మెళుకువ పుట్టును.
ధరణీచక్రం గిర గిర
పరిభ్రమిస్తోం దదిగో!
నిమ్నోన్నతముల జగతికి
ఉద్వాసన చదువుతోంది.
'పరాధీన పురాలోక వక్రగతి కృతకత్వం;
నిరాశనలమ్మై దీనుల వ్రేల్చిన కుటిలత్వం!'
దరిద్ర ధరణీ గీతికి
ఆకాశం ద్రవించింది;
దరిద్ర ధరణీశోకం
దిక్కులలో ధ్వనించింది....................