డా.పి. శ్రీదేవి రాసిన 'కాలాతీత కథ' వాళ్ళు పాడిన భూపాలరాగం
- శీలా సుభద్రాదేవి
డా.పి. శ్రీదేవి పేరు చెప్పగానే 'కాలాతీత వ్యక్తులు' నవల గుర్తుకు రానివారు అరుదు. అయితే ఆమె కథలు కూడా రాసినట్లు తెలిసినా ఆ కథల్ని తెలిసినవారు తక్కువే. పి.శ్రీదేవి రాసిన కథలు రాశిలో తక్కువే అయినా వాటిలో 'కాలాతీత వ్యక్తులు'కు దీటుగా ఉన్న కథలు ఉన్నాయి. నవలలో పాత్రల లాగే మరపురాని పాత్రలతో ఉన్న కథగా చటుక్కున చెప్పదగినది - 'వాళ్ళు పాడిన భూపాలరాగం'. ఇది 1959లో జయంతి (జులై) సంచికలో ప్రచురితం. 1966లో 'ఏరినపూలు' సంకలనంలో చేర్చబడింది. అనేక భిన్న మనస్తత్వాలు గల పాత్రలలో, అనేక సంఘటనలతో, ఆనాటి సమజానికి ప్రతిబింబంగా ఉండి, కథావిస్తృతి కలిగి ఉండటం చేత దీనిని నవలికగా కూడా చెప్పుకోవచ్చు. కాలాతీత వ్యక్తులు నవల రాసిన తర్వాత రాసిన కథ కావటాన కథాసంవిధానంలో, పాత్రల చిత్రణలో ఈ కథపై కూడా దాని ప్రభావం ఉంటుంది.
ఇందులోని కథంతా చెప్పకుండా పాత్రల్ని, పాత్రల స్వభావాల్నీ, మాత్రమే చెపుతాను. ఎందుకంటే ఇందులోని పాత్రలు కూడా సమాజంలో ఎప్పటికీ ఉండే పాత్రలే. పాత్రని సృష్టించేటప్పుడు పాత్రల యొక్క మూలస్వభావాన్ని కూడా పాఠకులకు అవగాహన అయ్యేలా సంఘటనల్నీ, సంభాషణల్నీ కూర్చే శైలి శ్రీదేవికే స్వంతం. అందుకనే వీరి పాత్రలు ఎప్పటికీ సజీవంగా వుంటాయి.
రామచంద్రయ్య: శుద్ధ మాష్టరీ ఉద్యోగం. లేమికి గానీ, అశుచికిగానీ బాధపడడు. అనారోగ్యం ఎరగడు. జీవితావసరాలు సమపాళ్ళలో వుండే కుదురైన సంసారం. రేడియోలూ, సినిమాలూ, గ్రామఫోన్ల వంటి అధునాతనమైన వాటిని నమ్మడు. ఇంట్లో ఏ కార్యం చేసినా పొదుపుగా, శాస్త్రోక్తంగా చేస్తాడు. ఒకరి మీద ఆధారపడకుండా బతకాలనే మధ్యతరగతి సగటు మనిషి మనస్తత్వం, జీవన విధానం కలవాడు. తిండి, బట్ట బతకటానికి చాలనేది అతని ఉద్దేశ్యం. అందుకే.....................