డాక్టర్ సందేశివరలింగన్న భైరప్పగారి పేరు కన్నడ సారస్వత Karnataka, India - లోకంలో జనప్రియమై ఉన్నది.
వీరి వయస్సు 89 సం||లు. వీరి తొలి నవల 'ధర్మశ్రీ' 1959 సం||లో తన 26వ ఏట ప్రకటితమైనది. నేటివరకు ఉన్నత శ్రేణికి చెందిన ఐదు విచార విమర్శనాత్మకమైన ప్రబంధాలతో కలిపి దాదాపు నలభైకి పైగా రచనలు ప్రచురితమై ప్రజాదరణ పొందినవి.
విద్యాసక్తిగల వీరికి 10వ తరగతి ఉత్తీర్ణులైన తరువాత ధనాభావంవల్ల విద్యాభ్యాసానికి ఆటంకమేర్పడింది. ఆ సంవత్సరం బెంగుళూరు, దావణగిరి, హుబ్బిళ్ళి మొదలైన పట్టణాలలో పనిచేసి పూట భోజనంతో గడిపారు. కష్టనిష్ఠూరాలను సహించి నందున కలిగిన అనుభవమే వారి సాహిత్యంలోని పాత్రలు సజీవంగా ఉండటానికి కారణం.
డా. యస్.యల్. భైరప్ప పరీక్షలకు పనికిరాని ధర్మ, తత్వ భాషా శాస్త్రాది జ్ఞానప్రబోధ విషయాలను అభ్యసించేవారు. బి.ఏ. ఆనర్సులో వీరు ప్రథమశ్రేణిలో ప్రథమస్థానం సంపాదించి బంగారు పతక బహూకృతిని పొందారు. వీరు యం.ఏ.లో కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు. తరువాత 'సత్యసౌందర్యం' అనే ప్రబంధం రచించి బరోడా విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టం పొందారు. ..
"వంశవృక్షం" అనే వీరి కన్నడ నవలకు 1967 సంవత్సరంలో మైసూరు సాహిత్య అకాడమీవారు ప్రథమ పారితోషకమిచ్చి గౌరవించారు. మైసూరు విశ్వవిద్యాలయం వారు 1971-72 విద్యాసంవత్సరంలో బి.ఏ. పాఠ్యగ్రంథంగా దీనిని ఎన్నుకొన్నారు. దీని హిందీ అనువాదం ప్రకటితమైనది. ఈ కథ చలనచిత్ర రూపంలో వచ్చింది.
- డా. యస్. యల్. భైరప్ప