"వానప్రస్థ" అనే సంస్కృత పదానికి 'అడవిలోకి వెళ్ళేమార్గం' అని అర్ధం. "వానప్రస్థ" అనే పదం రెండు పదాల కలయికతో ఏర్పడింది. అది ఎలాగంటే... 'వన' అనగా అడవి అని. 'ప్రజ్ఞ' అనగా వెళ్ళటం లేదా నివసించటం అని అర్ధం. కనుక, "వానప్రస్థ" అనగా, అడవులకు వెళ్ళటం లేదా సమాజ జీవితానికి దూరంగా వెళ్ళటం అని అర్ధంచేసుకోవచ్చు.
హైందవ మతంలో చెప్పబడిన ఆశ్రమ ధర్మాలలో మొదటిది - బ్రహ్మచర్యాశ్రమమం. రెండవది - గృహస్థాశ్రమం. మూడవది - వానప్రస్థాశ్రమం. నాల్గవది - సన్యాసాశ్రమం.
హైందవ ధర్మశాస్త్రాలలో చెప్పబడిన సమాచారం ప్రకారం చూసినట్లయితే, ప్రతి మనిషి అనగా, ప్రతి పురుషుడు తన జీవితంలో - ధర్మ, అర్ధ, కామ అనే మూడు అంశాలను సాధించాల్సి ఉంటుంది. ఇక్కడ "ధర్మ" అనగా, అతడు చెయ్యవలసిన విధులు అని, "అర్ధ" అనగా ధనము, అధికారము అని, "కామ" అనగా, స్త్రీతో అనుభవించే శృంగార సుఖం అని అర్ధం. ప్రతి హైందవ పురుషుడు. తన జీవితంలో మొదట, పైన పేర్కొన్న మూడు అంశాలను సాధించుకుని ఆ తరువాత "మోక్షం" గురించి ప్రయత్నించాలి. జీవితంలో సుఖాలు మరియు కష్టాలు సంపూర్తిగా అనుభవించినవాళ్ళకే - విధివ్రాత, కాలప్రభావం, దైవ మహత్యం అంటే ఏమిటో, నిజంగా అర్ధమవుతుంది. కనుక, పైన పేర్కొన్న ధర్మ - అర్ధ కామ అనే మూడు అంశాలను లేదా పరిస్థితులను అనుభవించిన వాళ్ళకే మోక్షాన్ని పొందాలనే కాంక్ష మరియు అర్హత లభిస్తాయని హైందవ ధర్మశాస్త్రాలు ఉద్ఘాటిస్తున్నాయి.