వార్త రాసి పంపించాకో, ఓవర్ టు స్టూడియో అన్నా ఇంకా ఏదో వెలితి మెలిపెడుతూనే ఉంటుంది. ఈ వెలితిని అందరూ గుర్తించరు. గుర్తిస్తే ఆ హింస మరింత తీవ్రం. నేను గుర్తించి, అనుభవించిన హింసా ఫలమే ఈ వ్యాసాలు. అందుకే వార్తలు సమాప్తం అన్నాను. లోపలి కథ మళ్ళీ మొదలు అని టాగ్ ఇచ్చింది కూడా అందుకే.
జర్నలిస్ట్గా పని చేస్తున్న సందర్భంలో అన్ని అంశాలను లోతుగా విశ్లేషించే అవకాశం తక్కువ. అనేక పరిమితులకు లోబడి వ్యవహరించాలి. బయట ఒక దుర్మార్గం జరిగినప్పుడు లేదా ప్రజలకు సంబంధించిన హక్కులు ధ్వంసమవుతున్న సందర్భాలలో ఒక వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈ ప్రక్రియ ద్వారా నా భావాలను వ్యక్తీకరించాను. ఎక్కడి వెలితినో ఇక్కడ పూడ్చుకున్నాను.
ఎప్పటి నుంచో పత్రికలకు వ్యాసాలు రాయాలన్న ఆస) ఉన్నా అనేక అవరోధాల మధ్య రాయలేకపోయాను. కుటుంబ, ఉద్యోగ సంబంధమైన అవరోధాలు నా వ్యాస రచనను ముందుకు సాగనివ్వలేదు.................