విలక్షణ రచన 'వాసవి'
భారతీయ సమాజంలో కులాలకీ, కుల పురాణాలకీ ప్రాశస్త్యం ఉంది. కుల దేవతల్ని కొలిచే సంప్రదాయమూ నేటికీ కొనసాగుతున్నది. కానీ ఆయా కులాల చరిత్ర, పరిణామక్రమం గురించిన అధ్యయనాలు తక్కువ. అందునా కల్పనా సాహిత్యంలో వీటి ప్రస్తావన అరుదు. ముఖ్యంగా కొన్ని కులాల ప్రాభవం గురించి తెలుగులో చెప్పుకోదగిన కథలు, నవలలు రాలేదు. 'వాసవి కన్యకాపరమేశ్వరి ప్రసిద్ధ దేవత. ప్రత్యేకంగా ఆలయాలు సైతం ఉన్నాయి. కానీ తెలుగులో ఆమె చరిత్రనీ, వైశిష్ట్యాన్నీ తెలిపే సృజనాత్మక రచనలు లేవు. కన్నడంలో ప్రముఖ రచయిత జె.సు.నా. 'వాసవి'ని ఇతివృత్తంగా తీసుకొని మంచి నవల రాశారు. ఇందులోని కథాకథనం ప్రత్యేక ఆకర్షణ. వేలూరి కృష్ణమూర్తి గారు ఈ నవలని ఇష్టంగా అనువాదం చేశారు. గత ఏడాది వారి నవలలు మూడు - సీత, పుంస్త్రీ, మహాయోగి పతంజలిని ముద్రించడమైంది. వాటి వలెనే ఇది కూడా తెలుగు పాఠకులకు ఆసక్తిని కలిగించే వైవిధ్యమైన నవల. వైశ్య కుల దేవతగా ప్రఖ్యాతి చెందిన 'వాసవి' గురించి చక్కటి ఊహాశాలితతో ఈ నవలని రచించిన జె.సు.నా. గారు అభినందనీయులు. ఈ నవలని కృష్ణమూర్తి గారు తెలుగులో రసరమ్యమైన రీతిలో అనుసృజించారు.
కన్యకాపరమేశ్వరికి సంబంధించి తెలుగులో ఇటువంటి రచన రాలేదు. ఒక దేవతగా కొలవడమే తప్ప చారిత్రక ఆధారాలతో కూడిన రచన ఎవరూ చేయలేదు. వైశ్యకులం మీద రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తుంటాయి. అయితే వారి అసలు స్వభావంలోని దయాపూరిత గుణాలనీ, సాహసోపేతమైన క్రియాశీలతనీ పట్టిచూపే నవల 'వాసవి'. నీతి నియమాలకీ, ఆత్మగౌరవానికీ ప్రాధాన్యమిచ్చే నైజమున్న వారని నిరూపించడం ఈ రచన ప్రత్యేకత. అతి సహజంగా సాగిపోయే కథాకథన శైలి లోని సౌందర్యం ఈ నవలకు చదివించే శక్తిని సంతరించింది. ఇందుకు దోహదం చేసిన అనువాదకుని ప్రతిభ ప్రశంసనీయం. వేలూరి కృష్ణమూర్తి గారి అనువాద ప్రతిభకు మరో నిదర్శనంగా నిలిచిపోయే ఈ నవలను పాఠకులు సమాదరిస్తారని ఆశిస్తున్నాం................................