వావిళ్ల వైభవమ్
ఆదిశంకర భగవత్పాదాచార్యులు 'భక్తి'ని నిర్వచిస్తూ "స్వస్వరూపాను సంధానమ్ భక్తి రిత్యభిధీయతే" అని తమ ప్రసిద్ధ రచన 'వివేకచూడామణి'లో అంటారు. అఖండ చైతన్య స్వరూపమైన బ్రహ్మమును ఆత్మ స్వరూపముగా అనుసంధానము గావించడమే 'భక్తి' అని పేర్కొనబడుతుంది. 'కావ్యగతములైన శతాంశములలో తొంబదిపాళ్ళు కవి ప్రతిభలో అగుపడుతుందని' బ్రాహ్మీమయమూర్తి కవిసమ్రాట్టు విశ్వనాధ సత్యనారాయణగారి అభిప్రాయం. ఇలాంటి ధోరణితో తనదైన రీతిలో స్వస్వరూపానుసంధానం ఒకవైపు, కావ్యగత ప్రతిభ మరొకవైపు కలగలుపుగా విశేష పరిశోధనాత్మకంగా రూపొందిన ఒక మంచి రచన "వావిళ్ల సాహితీ వికాసం (వావిళ్ల నుంచి వావిళ్ల దాకా)" అనే ఈ గ్రంథం.
డా॥ వి.వి. వేంకటరమణ, ఒక కేంద్ర ప్రభుత్వాధికారిగా చిరకాలం సేవలందించి ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్న సాంకేతిక విద్యా నైపుణ్యశీలి. ఇప్పటికే కంప్యూటర్ల అంశాలపైనా, ఆధ్యాత్మిక రంగంలో భగవాన్ రమణమహర్షుల ఆత్మీయులైన కావ్యకంఠ గణపతిముని వంటి వారి రచనలపైనా సుమారు పదిహేను ప్రామాణిక గ్రంథాలను వెలువరించిన ప్రసిద్ధుడు. ఆయన రచనా సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఈ పూర్వ రచనలు చాలు.
'దేశ చరిత్రలు రాయటం కష్టం. కానీ వ్యక్తుల జీవిత చరిత్రలు రాయటం మరీ కష్టం' అని ప్రసిద్ధ గ్రంథాలయోద్యమకారులు శ్రీ వెలగా వెంకటప్పయ్య అంటారు. దానిక్కారణం వారి బాహ్యజీవిత విషయాలు సేకరించడమే కాదు, ఆ మహానుభావుల ఆంతరంగిక అంశాలు, వ్యక్తిత్వ విశేషాలు ఎన్నింటినో రచనలో ప్రతిఫలింపజేయడం కష్టమైన పని. అలాంటి ధోరణితో ఎంతో శ్రమకోర్చి అపార విషయసేకరణ గావించి వావిళ్లవారి వాఙ్మయ వైభవాన్ని గురించి సుమారు ఆరువందల పుటలను మించిన గ్రంథం రూపొందించడం సామాన్యమైన విషయం కాదు. ఇందులో ప్రతి పేజీలోను ఆయన పరిశోధనాత్మక కృషి, మొక్కవోని పట్టుదల పాఠకుడికి అగుపడుతుందంటే అతిశయోక్తి కాదు.
1854వ సంవత్సరంలోనే పుస్తక ప్రచురణ రంగంలో ప్రవేశించి అఖండ విజయం సాధించిన మహనీయులు వావిళ్లవారు. భారతీయ సంస్కృతివైభవాన్ని, సంస్కృతాంధ్ర భాషా సాహిత్యాన్ని నిర్దిష్టంగా, ప్రామాణికంగా పండిత, పామర జనరంజకంగా తెలుగుజాతికి అందించి విశేషసారస్వత సేవగా వించిన మహనీయ ప్రచురణసంస్థ 'వావిళ్ల. ఈసంస్థ మూలపురుషులైన బ్రహ్మశ్రీ వావిళ్ల రామస్వామిశాస్త్రులు (1826-1891) అలనాటి శృంగేరి జగద్గురువులు, 32వ పీఠాధిపతులు, మహాతపస్సంపన్నులు అయిన జగద్గురు శ్రీ నృసింహభారతీస్వాములవారి ఆశీర్వాద అనుగ్రహబలంతో ఈ వావిళ్ల కల్పవృక్షాన్ని తెలుగుసాహితీ నందనవనంలో.................