సంపూర్ణ
శ్రీ వరాహ మహా పురాణం
భూదేవి ప్రార్ధన
నారాయణుడైన శ్రీకృష్ణునికి, మానవోత్తముడైన అర్జునునికి, వాగధిష్ఠానదేవత అయిన సరస్వతీదేవికి, వ్యాసభగవానునికి నమస్కరించి జయము అని పిలువబడు శ్రీమన్మహాభారతమును, పురాణములను పఠింపవలెను. పూల చెండువలె భూమిని తన కోరలపై నిలిపి ఉద్ధరించిన యజ్ఞవరాహస్వామి కాలి గిట్ట మధ్య చిక్కిన మేరుపర్వతము ఖణఖణలాడినది. అటువంటి వరాహదేవునికి నమస్కారము. కంస, మురాసుర, నరక, రావణాది రాక్షసులను సంహరించిన, సర్వ వ్యాపకుడైన శ్రీమహావిష్ణువు యొక్క అవతారమగు వరాహస్వామి నా శత్రువులను నిర్మూలించును గాక! రోగములు, ముసలితనము, మరణము అను మొసళ్ళతో కూడిన భయంకరమైన సంసార సాగరమున మునకలు వేయుచు భీతిల్లుచున్న భక్తులకు అభయమునిచ్చువాడును, భూదేవికి నాథుడును, లోక రక్షకుడును, ముముక్షువులకు మాత్రమే దర్శనమిచ్చువాడును అగు వరాహస్వామి అందరకును సుఖ స్వరూపుడగు గాక! పూర్వము భూదేవి తనను ఉద్ధరించిన వరాహదేవునితో "స్వామీ! ప్రతి కల్పమునందును నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. కాని నేను నీ స్వరూపమును ఎరుగను. తొల్లి నీవు మత్స్యమూర్తిపై రసాతలమున కేగి వేదములను తెచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చితివి. దేవదానవులు క్షీరసాగరమును మధించినపుడు కూర్మరూపమును ధరించి నీ వీపు చిప్పపై మందర పర్వతమును నిలిపితివి. రసాతలమునకు జారుచున్న నన్ను మహాసముద్రము నుండి..............