కళింగాన్వేషణ
ప్రతి ఒక్క చరిత్ర ఒక కథనం. ప్రధానంగా అది విజేతల కథనం. బలవంతుల కథనం. కొన్ని ప్రాంతాలు ఒక ఉమ్మడి ప్రాంతంగా రూపొందేటప్పుడు వాళ్ళల్లో ఎవరు ఎక్కువ బలవంతులైతే వారి కథనమే ఆ ఉమ్మడి ప్రాంతానికి చెందిన చరిత్రగా రూపొందుతూ వచ్చింది. అది కాలక్రమంలో కేంద్రీకరణకు దారి తీసింది. తిరిగి మళ్ళా ఆ ప్రాంతాలు ఆ కేంద్రీకృత కథనాల్ని ధిక్కరిస్తూ తమ కథనాల్ని ముందుకు తెచ్చినప్పుడు ఆ చరిత్ర మరొక కొత్త కథనంగా మారుతుంది. ఏ దేశ చరిత్ర చూసినా ఇదే సరళి కాని, ఈ సూత్రం భారతదేశ చరిత్రకు మరింత బాగా వర్తిస్తుంది.
ఆదినుంచీ భారతదేశ చరిత్ర గురించిన కథనాలు చదివినవారికి అది కొన్ని సార్లు అంచులనుంచి కేంద్రానికీ, కొన్నిసార్లు కేంద్రం నుంచి అంచులకీ ప్రయాణిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఒక యుగంలో అది గంగా-సింధూ మైదాన చరిత్ర. మరొక యుగంలో బహుళ సంస్కృతుల, బహుళ ప్రాంతాల చరిత్ర. జాతీయోద్యమకాలంలో భారతజాతి అనే ఒక రాజకీయ భావనను బలపరిచే క్రమంలో, మనం ఎన్ని భాషలు, ఎన్ని మతాలు, ఎన్ని సంస్కృతులుగా వర్ధిల్లుతున్నప్పటికీ మనమంతా ఒకే జాతి అనే ఆలోచనకి పెద్దపీట వేసారు. భిన్నత్వంలో ఏకత్వం అనే ఆదర్శాన్ని ముందుకు తీసుకువచ్చారు.
జాతీయోద్యమం ఫలించి రాజకీయంగా మనం స్వాతంత్య్రం సంపాదించు కున్నాక భారతదేశం చరిత్రలో తొలిసారిగా ఒక రాజ్యాంగ పరిధిలోకి వచ్చింది. కాని అదేసమయంలో అంతదాకా మనం చెప్పుకున్న కథనాల్లో ఎన్నో ప్రాంతాలకీ,...............