విమర్శ ఎందుకు?
విమర్శ అంటే ఏమిటి? దాని ఉద్దేశ్యం ఏమిటి? విమర్శ ఎవరికి? ఎందుకు? అనే ప్రశ్నలకు ఒక నిరంతర సాహిత్య పాఠకుడు స్వీయానుభవాలు ప్రాతిపదికగా చెబుతున్న సమాధానాలు ఈ వ్యాసం.
సాహిత్యావగాహనను పెంచడం విమర్శ ఉద్దేశ్యం. ఆ పనికి తోడ్పడే రచన ఏ రూపంలో ఉన్నా అది విమర్శే.
గుణదోష విశ్లేషణ చేసే రచనను విమర్శ అని వ్యవహరిస్తున్నాం. సైద్ధాంతికం (థియరిటికల్)గా ఇలా అంటున్నప్పటికీ ప్రయోగంలో ఈ పదం ఇంకా విస్తృతార్థంలో కనబడుతుంది. ఉదాహరణకు- విమర్శ విజ్ఞానసర్వస్వాలలో అలంకారశాస్త్ర సంబంధమైన అంశాలూ, కథానిక నవల వంటి ప్రక్రియల స్వరూప స్వభావ వివరణలూ, సాహిత్యతత్వ వివేచన వ్యాసాలూ కూడా ఉంటాయి.
సరైన సమీక్ష, మంచి పీఠిక కూడా విమర్శచ్ఛాయతో కనిపిస్తాయి. కె.వి. రమణారెడ్డి గారు, రా.రా. వంటి కొందరయితే ఉత్తమస్థాయి విమర్శతో కూడిన సమీక్షావ్యాసాలు రాశారు. కృష్ణశాస్త్రిగారు 'ఏకాంత సేవ'కు రాసిన పీఠిక భావకవిత్వ ముఖ్యలక్షణ ప్రకటనగా సాక్షాత్కరిస్తుంది. విమర్శగురించిన వివేచనకు పూనుకున్న చాలామంది ప్రసిద్ధ విమర్శకులు పీఠికలనూ సమీక్షా వ్యాసాలనూ కూడా విమర్శగానే వ్యవహరించడం గమనించవచ్చు. (ఉదా|| చేకూరి రామారావుగారి రచనలు).
లోతుగా పరిశీలిస్తే వ్యాఖ్యానం కూడా విమర్శ పరిధిలోదే అని తడుతుంది. వ్యాఖ్యానం కేవలం అర్ధవివరణతో సరిపెట్టుకోవడంలేదు. వీలయిన ప్రతి సందర్భంలోనూ విశేషాంశాలు చెబుతుంది. కావ్యం ఖండనకు గురైన ప్రతిస్థలాన అది సమర్థనకు పూనుకుంటుంది..............