'వెండితెరపై విప్లవశంఖం'. ఇది మాదాల రంగారావు చిత్రాలకు శ్రీశ్రీ రాసిన, వారు మాదాల రంగారావు రాయించుకున్న శ్రీశ్రీ గీతాలు. వెండితెరపై తొలిసారి ఎర్రజెండా ఎగరేసిన మాదాల రంగారావుకు తెలుగు సాహిత్యంలో ఎర్రజెండా, ప్రపంచ సాహిత్యంలో తెలుగు జెండా ఎగరేసిన మహాకవి శ్రీశ్రీ అంటే ప్రాణం. ఆయనకు శ్రీశ్రీ అంటే జ్ఞానం.ఈ సందర్భంగా వారిరువురి పరస్పర అరుణ బంధం గురించి తెలియజేసే రెండు మూడు సందర్భాలు పాఠకుల కోసం ఇక్కడ పొందు పరుస్తున్నాం. -
"ఈ ఇరవయ్యో శతాబ్దపు కవీ, ఎహాకవీ ఆయన. విప్లవకవిత్వాన్నంతా రాసి జేబులో పెట్టుకున్నాడు. ఏ కవి అయినా ఏ రవి అయినా ఆ జేబులోని కవిత్వాన్ని దొంగిలించాల్సిందే”
(మహాకవికి అక్షరాంజలి 'జ్యోతిచిత్ర' శ్రీశ్రీ స్మారక ప్రత్యేకానుబంధం జూన్, 1983)
మాదాల గుండె కరిగి గుబులు గుబులుగా వస్తున్న దుఃఖానికి ఆనకట్టలు కట్టలేక సతమతమయ్యారు. 'విప్లవ శంఖం' చిత్రంలో నిలువెత్తు ఎర్రజెండా చూసిన శ్రీశ్రీ మోజుపడి 'మాదాలా ఇది నా శవంమీద కప్పు బావుంటుంది' అన్నారట నవ్వుతూ
ఆ మాట నిజమైంది అన్నారు మాదాల. ఆ జెండా తీసుకువచ్చారు. ప్రజలకోసం బ్రతికిన శ్రీశ్రీ అస్తమయవార్త విన్న ప్రజ గోడు, గోడున విలపిస్తూ... ఎర్ర గులాబీలతో, విప్లవ సాహిత్య గ్రంథాలతో, ఎర్రజెండాతో ఆయన్ని కప్పివేశారు. మాదాల యూనిట్ భక్తి, శ్రద్ధాసక్తులతో జోహార్లు అర్పిస్తూ శ్రీశ్రీ అంతిమయాత్ర చిత్రీకరించారు.
(శ్రీశ్రీ అంతిమ యాత్ర, 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక జూన్ 17, 1983)
హాస్పిటల్లో చేరాక వారు మాదాల రంగారావుగారికి, యు. విశ్వేశ్వరరావుగారికి ఫోన్ చేసి చెప్పమన్నారు. ఇంకెవరికీ చెప్పొద్దన్నారు.మాదాల రంగారావుగారు గొప్ప సాయం చేసేవారు, ఇది రాశారు ఇస్తున్నాం అనుకునే వారు కాదు. ఆయనంటే వారికెంతో అభిమానం. అలాగే యు. విశ్వేశ్వరరావుగారూనూ. ఇద్దరికిద్దరు బాస్ అనుకునేవారు.అయితే పద్మాలయ సంస్థ(హీరో కృష్ణను కూడా ఈ సందర్భంలో చెప్పుకోవాలి. రాసిన దానికన్నా ఎక్కువగా ప్రతిఫలం ముట్టజెప్పేవారు.
(సరోజాశీశ్రీతో పసుపులేటి రామారావు ఇంటర్వ్యూ , సంసారంలో శ్రీశ్రీ'మూడోసంపుటి అక్టోబరు, 1993)
అఆ పుస్తకాలు,శ్రీశ్రీపై పుస్తకాలు ప్రణాళికలలో రెండో 'నూరుపుస్తకాల హోరు' ప్రణాళికలో వెలువడుతున్న 107వ పుస్తకం ఇది. శ్రీశ్రీ సాహిత్య ఉద్యమయాత్రలోకి కదలి కలిసిరండి, పది మందినీ కలుపుకురండి. మీ వంతూ గొంతూ అందించండి.
కన్వీనర్, శ్రీశ్రీ సాహిత్యనిధి.