వెండిగిన్నెలో పాలబువ్వ
"అమ్మాయ్ వినూషా!”
ఫోన్లో అన్నమ్మ పిలుపు విన్పించేసరికి వినూష మనస్సు ఉత్తుంగ తరంగమయ్యింది. ఆనందోద్విగ్నయై ఊగి పోయింది.
అంది.
"పెద్దమ్మా! ఎన్నాళ్ళ కెన్నాళ్ళకి నీ గొంతు విన్నానూ!" చిన్న పిల్లలా మారిపోతూ
వెన్నెల చిలికినట్లు నవ్విందామె. “ఏం జేస్తున్నారే. శ్రీజ బాగా చదువుకొంటోందా? చిట్టి యువరాజు విరాట్ బాగా అల్లరి చేస్తున్నాడా? అల్లుడుగారు ఎలా వున్నారే... వసపిట్టలా వడవడ వాగేస్తున్నా నోరు విప్పవేమే, ఏం చేస్తున్నావ్?”
"నీ మాటల జడివానలో నిలువునా తడిసి ముద్దవుతున్నాను పెద్దమ్మా” "మాటలు నేర్చావు గాని అంతా బావున్నారు కదా?”
"బాగానే వున్నాం. నువ్వూ పెదనాన్నా ఎలాగున్నారు?”
"మాకేం దిబ్బరొట్టెల్లా బాగానే వున్నాం గానీ నువ్వూ అల్లుడుగారూ పిల్లల్ని తీసుకుని పెద్దపండక్కి రండి. పండక్కి రెండ్రోజులు ముందే రావాలి. చంటోడికి భోగిపళ్ళు పోద్దాం...” "ఇంకో రెండు నెలల్లో విరాట్కి ఆరో ఏడు వస్తుంది. ఇప్పుడు భోగిపళ్ళేవిటీ!"
"సూర్యుని సంఖ్య ఏడు గనుక ఏడు సంవత్సరాలలోపు పిల్లలకి భోగిపళ్ళు పోయాలి. పిల్లల ఆరోగ్యాన్నీ ఆయుష్షునీ ఆకాంక్షిస్తూ పోసేవేనే ఈ భోగిపళ్ళు. తప్పకుండా రండి
సుమా"
"నాకూ రావాలనే వుంది పెద్దమ్మా. ఆయనా పిల్లలూ ఏవంటారో!"
"ఏమీ అనరు. నేను పిలిచానని చెప్పు చాలు. ఎప్పుడో అయిదారేళ్ళ క్రితం విరాట్ కడుపులో వుండగా వచ్చావు. మీ ఆయనైతే ఇంతదాకా మా గుమ్మం తొక్కనేలేదు. ప్రతి ఏడాదీ నేను రమ్మనడమే గాని మీరొచ్చిన పాపాన పోలేదు!" నిష్ఠూరమాడింది.
"ఆయన ఉద్యోగం సంగతి నీకు తెలుసుకదా పెద్దమ్మా. క్షణం తీరికుండదు"...........................