ఎ ప్రొహిబిటెడ్ స్టోరీ
గోపాల్రావుకి తాగాలనిపించింది. ఇంతకుముందు చాలా సార్లు అతనికి అలాగ అనిపించింది.
అలా అనిపించిన చాలాసార్లు అతను తాగాడు. మంచినీళ్ళు, కాఫీ, సేమ్యా, కూల్ డ్రింక్ ! కానీ, ఆ వేళ అతనికి తాగాలనిపించినవి అవేవీ కావు. అతనికి తాగాలనిపించినది ''బ్రాందీ'. అతనికి 'బ్రాందీ' తాగాలనే కోరిక చాలా ఏళ్ళబట్టి ఉంది.
అతని చిన్నప్పుడు వాళ్ళ పక్కింట్లో 'చిట్టిబాబు' అనే కుర్రాడు ఉండే వాడు. వాడిది, గోపాలానిది ఒకటే వయసు. ఇద్దరికీ కలిపి ఇరవై రెండేళ్ళు ఉండేవి. కానీ, ఆ చిట్టిబాబు ఇరవై ఏళ్ళవాడిలాగ ఫీలవుతూ, గోపాలాన్ని రెండేళ్ళ వాడిని చూసినట్టు చూసేవాడు. ఆ చిట్టిబాబు మామయ్య అప్పుడప్పుడు ఏదో మందు సీసాలతో తెచ్చుకుని తాగేవాడు. ఆయన అలా తాగుతున్నప్పుడు గోపాలం, చిట్టిబాబు రహస్యంగా కిటికీలోంచి చూస్తుండేవారు. ఆయన తాగక ముందు నెమ్మదిగా, పథ్యం తిన్నవాడిలాగ మందు తిన్న కోడిలాగ, చిరాకుగా, వీక్ గా ఉండే వాడు, కానీ తాగాక మంచిరకం పాములా బుసలు కొట్టేవాడు. తుఫానుగాలిలో తాటి చెట్టులాగ ఊగేవాడు. చిట్టిబాబు చిన్నతమ్ముడిలా తప్పటడుగులు వేసే వాడు. అరిచేవాడు. నవ్వేవాడు. ఏడ్చేవాడు. ఆ పైన పడుకునేవాడు.
అప్పుడు గోపాలానికి చిట్టిబాబు చెప్పేవాడు ఆయన తాగింది 'బ్రాందీ' అని, అది ఖరీదయిన దొరల మందు అని, అప్పుడెప్పుడో తిరునాళ్ళలో తాము ఎక్కిన రంగులరాట్నం తిరిగినట్టు అది మనిషిని తిప్పుతుందని, అది తాగితే గమ్మత్తుగా ఉంటుందనికూడా చెప్పాడు. గోపాలానికి దానిరుచి ఎలా ఉంటుందోనని అనుమానం...............