ఇదీ హైందవం
"హిందువులు మహాప్రమాదంలో ఉండగా మనలో మనం పోట్లాడు కోవటం మంచిది కాదు. మన పిల్లలు, మన దేశం, మన సంపద, మన దైవం, మన దేవాలయాలు, మన పవిత్ర ఆరాధకుల మనుగడే ఇప్పుడు శత్రు దురాగతాల మూలంగా ప్రమాదంలో పడింది. బాధ భరించగల స్థితిని దాటిపోయింది. ఈ తీరు ఇంకొంతకాలం ఇలాగే సాగితే భూమి మీద మన ఆనవాలు మిగలదు. హిందువులను, హిందూస్తాను, హిందూ మతాన్ని రక్షించటానికి శాయశక్తులా పాటుపడాలి.”
పురందర్ సంధికి ముందు తనను బంధించటానికి ఔరంగజేబు పనుపున పెద్ద సైన్యంతో వచ్చిన రాజపుత్ర ప్రముఖుడు మీర్జా జయసింగుకు 1665లో పంపిన సందేశంలో ఛత్రపతి శివాజీ చేసిన హితబోధ ఇది. తన దేశం మీద, తన మతం మీద, తన ప్రజల పట్ల హైందవ ధర్మవీరుడికి ఉండే ప్రగాఢ నిబద్ధతను సూచించే ఈ పలుకులు వజ్రపు తునకలు.
మొగల్ పాదుషా సైనిక శక్తికి బెంబేలెత్తో, పరాజయ భయంతోనో వీర శివాజీ ఈ మాటలన్నాడా? కాదు. మరి శత్రు సేనానికి ఎందుకు ఆ రాయబారం? అదీ శివాజీ మహారాజ్ మాటల్లోనే వినండి:
"దక్షిణాపథాన్ని జయించాలని నీ అంతట నీవు వచ్చి ఉంటే నీ ముందు మోకరిల్లి, నీ గుర్రం వెంబడి నా సమస్త బలగాలతో నడిచి ఈ కొస నుంచి ఆ కొస దాకా నీవు కోరిన రాజ్యాన్ని నీకు సమర్పించి ఉండేవాడిని. కాని నువ్వు హిందువులను నాశనం చేయగోరే వారి ప్రేరేపణ మీద ఔరంగజేబు నియోగించగా వచ్చావు. నీతో ఎలా వ్యవహరించాలో నాకు అర్థం కావటం లేదు.
"నీతో చేరిపోతే అది మగటిమి కాదు. సింహం ఎప్పుడూ నక్క పోకడ పోదు. పోనీ నీ మీద కత్తి ఎత్తుదామా అంటే దానివల్ల రెండు వైపులా హిందువులకే నష్టం. మరీ విచారం ఎందుకంటే ముసల్మాన్ల నెత్తురు కోసం. అర్రులు చాచే నా ఖడ్గాన్ని మరొకందుకు ఒర నుంచి తీయవలసి వస్తుంది. యుద్ధం చెయ్యటానికి నువ్వుగాక తురుష్కులు ఇక్కడికి వచ్చి ఉంటే సింహం ...........................