నా గారడీ బడి
నేను చిన్నప్పుడు ఎంత మంచి బడిలో చదువుకొన్నానను కొన్నారు? ప్స్.... ఏం చెప్పేది ? దాన్ని తలచుకొంటే ఇప్పుడు కనీళ్ళు కట్టలు తెంచుకొంటాయి. నా కొడుకు ఆనందు అలాంటి స్కూలు దొరకలేదనే నా బాధంతా.
నా బడి కథ చెపుతుంటే మన పెద్దలు చెప్పే పురాణ కథలా మీకనిపించవచ్చు. నవ్వులాటగా వుండొచ్చు. కానీ నేను చెపుతున్నది ఓ అద్భుతమైన సంగతి.
నేను నాలుగేళ్ళపాటు సేవాగ్రాం ఆశ్రమ పాఠశాలలో చదువుకొన్నాను. నేనెప్పుడూ అక్కడ నాలుగ్గోడల తరగతి గది జైల్లో ఖైదీగా బతకలేదు. విసుగు పుట్టించే పాఠాల్ని బట్టీ వెయ్యలేదు. ప్రకృతి దగ్గరగా, సమాజానికి చేరువగా చేసే ప్రతి పనిలో దక్షతా, నైపుణ్యం ఉట్టిపడేలా నేను చదువుకొన్నాను. సేవాగ్రాం అనగానే మీకు గాంధీజీ గుర్తుకొచ్చి ఉంటారు.
మా ఆశ్రమానికి గాంధీజీ కోరిక మేరకు రవీంద్రనాధ్ ఠాగూర్ ఇద్దరు కార్యకర్తల్ని పంపారు. వారిలో ఆర్యనాయకమ్ సింహళీయుడు. ఆశాదేవి బెంగాలీ. గాంధీజీ బేసిక్ విద్య రవీంద్రుడి ప్రకృతి ప్రేమతో కళాతృష్ణతో మమైకమై పోయిందనుకోండి. ఓహ్! ఎంత మధురమధురానుభవాలు! ఎంతటి నిసర్గబోధనా విధానాలు. మీ కోసం కొన్నిటిని వివరిస్తా వినండి....................