పూర్వాశ్రమం
నా పేరు శమంత. అమ్మా నాన్నల గారాబంతో, నా బాల్యం ముద్దు మురిపాల తీపి గుర్తులతో గడిచిపోయింది. భగవంతుడు కరుణామయుడు. నాకు అందమైన రూపాన్ని ఇచ్చాడు. నాకు చక్కగా అలంకరించుకోవటం అంటే చాలా ఇష్టం.
ఎవరైనా నన్ను చూసి "మీ అమ్మాయి బంగారు బొమ్మలా ఉంటుంది” అని అమ్మ దగ్గర ప్రశంసిస్తుంటే, విన్న నా హృదయం వుప్పొంగిపోయేది. అప్పుడప్పుడూ అమ్మ సగర్వంగా నన్ను దగ్గరకు తీసుకుని, నా తల మీద చేయివేసి నిమురుతుంటే, నేను సంతోషంగా ఆమె గుండెలకి తల ఆనించి గువ్వలా ఒదిగిపోయేదాన్ని. కళ్ళు మూసుకుని, అమృతంలాంటి అమ్మ స్పర్శ, నా నరాల్లోకి ప్రవహిస్తుంటే నా మనసు, గువ్వపిట్టలా, రెక్కలు చాచుకుని ఆనంద లోకాల్లోకి ఎగిరిపోయేది. నా చదువు - నా అలంకరణ, పెళ్లిళ్ళకి - పార్టీలకి సంతోషంగా పరుగెట్టడం, అమ్మా నాన్నల దగ్గర గారాబం - వీటితో నా జీవితం - దాదాపు - ఇంద్రధనస్సు మీద నేను రాజకుమార్తెలా వయ్యారంగా కూర్చున్నట్టే 18 సంవత్సరాలు చకచకా పరుగులు దీశాయి............