విందుకు వెళ్ళిన విమల
చిన్న డాబా ఇల్లు, ఇంటి చుట్టూ నాలుగడుగుల ఎత్తయిన ప్రహరీ గోడ ఉంది. రాత్రి పదవొస్తోంది. హనుమాయమ్మకి ఇంకా నిద్రపట్టలేదు. పడగ్గదిలోంచి ఇంటిముందున్న కాంపౌండ్లోకి వచ్చింది. అమావాస్య కారు చీకటిలో తోటంతా నిశ్శబ్దంగా ఉంది. ఆలోచిస్తూ, హనుమాయమ్మ ఇంటి ముందు ఇటూ అటూ తిరుగుతోంది.
ఒకసారి ఉత్తరం వైపున్న ప్రహరీగోడ వారగా వెళ్ళి, చేతులను గోడమీద ఆనించి, రెండు ఫర్లాంగుల దూరంలో ఎదురుగా ఉన్న రామ్మూర్తి ఇంటివేపు వేసింది. అతని ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయి. ఇంకా విమల ఆ ఇంట్లో ఏం చేస్తోందో? ఈపాటికి భోజనాలు అయిపోయి ఉండాలి. అయితే, విమల ఇంకా ఇంటికి తిరిగి ఎందుకు రాలేదు? రామ్మూర్తి ఇంటికి భోజనానికి ఒంటరిగా వెళ్ళిన తన కూతుర్ని గురించి హనుమాయమ్మ ఆలోచిస్తోంది.
ఈనాటి యువకుల ప్రవర్తన చూస్తూంటే హనుమాయమ్మ ఒళ్ళు మండుతోంది. విమలకి చెప్పలేనంత కోపం, ఎప్పుడేనా "అమ్మాయీ, ఇంతసేపయింది, ఎక్కడికి వెళ్ళావు?” అని తల్లి ప్రశ్నిస్తే, కోపంగా "ఎక్కడికీ లేచిపోలేదులే! నా వయస్సు ఇరవై దాటింది. నా గొడవ నేను చూసుకోగలను," అనేది విమల. విమల స్వభావాన్ని గ్రహించి, హనుమాయమ్మ కూతుర్ని అనవసరంగా ప్రశ్నలు అడిగేది కాదు.
హనుమాయమ్మ విమలను గురించే ఆలోచిస్తోంది. తన భర్త పోయాక, ఉన్న కాస్త డబ్బునూ ఆమె జాగ్రత్తగా వాడుకుంటూ వస్తోంది. తను స్వయంగా కొంతమంది ఇళ్ళకి వెళ్ళి, సంగీతం నేర్పి, నెలకి ఓ నూరు రూపాయలు గణించి, కూతురుకి చదువు చెప్పించింది. విమల బి.ఎ పాసయి రెండేళ్ళయింది. కాని ఆమె ఏ ఉద్యోగంలోనూ చేరలేదు. హనుమాయమ్మ గణించే దానిమీదే కూతురు ఆధారపడుతోంది. విమలకి పెళ్ళయిపోతే తనకింక ఏ బాధ్యతా ఉండదు. రెండేళ్ళ నుంచి వెయ్యి కన్నులతో ఆమె అల్లుడు కోసం వెతుకుతోంది. ఆ సమయంలోనే విమలకి రామ్మూర్తితో పరిచయమైంది...............