ఆవు - పలుపుతాడు
బానిసలుగా బతుకుతున్న ఆవు, కుక్క పారిపోవాలనుకున్నాయి. అనుకున్నట్టుగా, చీకటి పడగానే కుక్క వచ్చి పలుపుతాడు కొరికెయ్యసాగింది.
కుక్క బావా, తాడునేం చెయ్యకు. ఆ గుంజుకు కట్టిన ముడిని మాత్రం విప్పు, మంచి తాడు, నాకున్న ఆస్తి ఇదొక్కటే" అంటూ బతిమాలింది ఆవు. కుక్క ముడి విప్పింది.
మూడో కంటికి కనిపించకుండా రెండూ వూరి పొలిమేరలు దాటాయి. మరి కాసేపటికి తాడు ఓ బండ పగులులో చిక్కుకుపోయి, ఎంత ప్రయత్నించినా రాలేదు.
పారిపోయిన తన పెంపుడు జంతువుల కోసం గాలిస్తూ వచ్చిన యజమానికి ఆవును పట్టుకోవటం కష్టమేమి కాలేదు.
"ఇదే కదా నేను చేసిన పొరబాటు. స్వేచ్ఛను కోరే వాళ్ళు ఆస్తి మీద ఆశ పెట్టుకోకూడదు" అనుకుని నిట్టూర్చింది ఆవు..............