మనవి మాటలు
ఆంధ్రత్వం మీద అభిమానమున్నవారికి తంజావూరు మీద ప్రత్యేక ఆసక్తి ఉండి తీరుతుంది. తమిళనాడు రాష్ట్రంలోని మధుర, తంజావూరు 16వ శతాబ్దంలో తెలుగు నాయకరాజ్యాలకు కేంద్రాలు. రెండు రాజ్యాల స్థాపనకు మధ్య వారడి కొద్ది సంవత్సరాలే. మధురలో క్రీ.శ. 1529 నుండి 1736 వరకూ, తంజావూరులో క్రీ.శ. 1535 నుండి 1673 వరకూ నాయకరాజుల పాలన సాగింది. మధురనాయకులు 17 మంది. తంజావూరు నాయకులు నలుగురే. తెలుగుభాష సాహిత్య సంస్కృతుల పోషణలో మధురతో పోలిస్తే తంజావూరు నూరు ఆమడల ఎత్తున ఉంటుంది. తంజావూరును తలచుకోగానే దక్షిణాదిలో తెలుగు ప్రాభవం మదిలో మెదులుతుంది. అంత లోతట్టు అరవ ప్రాంతంలో ఆంధ్రభాష అనుభవించిన వైభవం యింతా అంతా అని చెప్పలేనిది. సంగీతం, నాట్యం, సాహిత్యం, శిల్పం చిత్రలేఖనం విజయనగర సామ్రాజ్యంలో ఎంత వికసనం చెందాయో, తంజావూరు నాయకరాజ్యంలోనూ అంతే వికసనం చెందాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని శాఖలలో ఒకపాలు ఎక్కువేనేమో!
17వ శతాబ్దంనుండే భారతదేశంలో ఆధునికపోకడలు ఆరంభం అయ్యాయని వేల్చేరు నారాయణరావుగారి మాట. అందుకు ప్రథమసాక్షిగా తంజావూరే నిలబడుతుంది. ఆధునిక పోకడల అడుగుజాడల ఆనవాళ్లు తంజావూరు నుండి వెలువడిన సాహిత్యంలో దండిగా కనపడతాయి.
తంజావూరు... తంజావూరు... అనుకోగానే రఘునాథనాయకుడు, విజయరాఘవనాయకుడు, చేమకూర వెంకటకవి, చెంగల్వ కాళయ్య, క్షేత్రయ్య, రంగాజమ్మ, వాల్మీకిచరిత్ర, మేలట్టూరు, శాలియమంగళం, కర్నాటక సంగీత రత్నత్రయం, బృహదీశ్వరుడు, సరస్వతీమహల్ గ్రంథాలయం, కావేరి కాలువలు, మారియమ్మ, 'తత్తాధాధింతోం'లు, 'పరాకు'లు, బిరుదుపాత్రలు, అలవిమాలిన విస్తీర్ణంలోని పెద్దపే... గుళ్లు, అన్నింటికీ మించి ప్రజాభాషను రంగస్థలానికి................