తొణికిన స్వప్నం
'విశాలాంధ్రలో ప్రజారాజ్యం'
గత యాభై ఏళ్ళుగా తెలుగు భాషలో అత్యంత పరిహాసానికి, అపహాస్యానికి గురయిన ఏకైక పదం 'అభివృద్ధి'. గతంలో రాజకీయ పార్టీలు విధానపరమైన భావజాలంతో నడిచేవి. మా పార్టీ ఫలానా ఫలానా అభివృద్ధి సాధిస్తుంది అని ప్రకటించేవి. ఇప్పుడు మెజారిటీ రాజకీయ పక్షాలు అంతా వ్యక్తి కేంద్రకంగా నడుస్తున్నాయి. ఈ పార్టీల అధినాయకుల భాష అంతా ఉత్తమ పురుషలో నడుస్తుంది. 'నేను అభివృద్ధి చేస్తాను. నేను సంపద సృష్టిస్తాను, నేను సామాజిక న్యాయం అందిస్తాను, నేను దేశాన్ని సర్వోన్నతంగా నిలబెడతాను' అంతా 'నేనే' అన్న ఊక దంపుడు ప్రచారమే. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఇదే తీరు.
'అభివృద్ధి' అన్న పదానికి కొత్త కొత్త ప్రమాణాలు వచ్చాయి. 'అవుటర్ రింగ్ రోడ్లు, ఆకాశహార్యాలు, ఆరులైన్ల రహదారులు, స్మార్ట్ సిటీలు, వందేభారత్ రైళ్ళు, సింగపూర్ని తలదన్నే రాజధాని, కాదు, కాదు మూడు రాజధానులు' - ఇలా సరికొత్త కొలమానాలు చలామణి అవుతున్నాయి తప్ప మెరుగైన ప్రజల జీవన ప్రమాణాలు, గౌరవప్రదమైన - హుందా అయిన జీవితాలు గడిపే హక్కుల ఊసే ఉండదు. పైపెచ్చు ఈ రెండు అంశాల గురించి ప్రస్తావించే వాళ్ళు 'ఆందోళన జీవులు', 'అభివృద్ధి నిరోధకులు' అన్న హోదాలు తలకెత్తుకోవాల్సి వస్తుంది.
మనదేశం 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది. వికసిత భారతదేశాన్ని మీ ముంగిట నిలపబోతున్నాం అని ఊరూవాడా ప్రచారం జరుగుతుంది. కానీ ఐక్య రాజ్యసమితి వెలువరించిన మానవాభివృద్ధి సూచికలలో మన దేశం 120వ స్థానంలో నిలబడి ఉంటుంది.................