విశ్వమానవుడు - విస్తృత నాయకుడు
జి. ఉమా మహేశ్వర్ - ప్రముఖ కథా రచయిత, కర్నూలు
ఇరవై ఏళ్ల కింద డా. ఎం. హరికిషన్, 'గామాగో' అనే పేరు, ఆ పేరు గల వ్యక్తి గురించి మొదటిసారి నాతో చూచాయగా చెప్పినప్పుడు చిత్రంగా ఉంది అనుకున్నాను. పేరుకు కర్నూలు జిల్లా వాడినయినా మా నాన్న ఉద్యోగరీత్యా వేరువేరు ప్రాంతాలు తిరగడం వల్ల 1993లో కర్నూలుకు వచ్చేవరకూ నాకు కర్నూలు చరిత్ర పెద్దగా తెలియదు. అలా తెలుసుకుంటున్న క్రమంలోనే గామాగో గారి గురించి తెలిసింది. అప్పటికయినా, ఆసక్తిగా అనిపించిన ఆయన పేరుమార్పిడి గురించి మాత్రమే తెలుసుకున్నాను గానీ ఆయన జీవితాన్ని పూర్తిగా తెలుసుకునే అవసరం, అవకాశం కలుగలేదు. 'విస్మృత కార్యకర్త' పేరుతో ఆయన రాసుకున్న ఆత్మకథాత్మక కథనం గురించి తెలుసుకుని మొత్తం పుస్తకం చదివాక విస్తుపోయాను. కర్నూలు వాడినని చెప్పుకుంటూ ఇంతటి అసాధారణమైన వ్యక్తి గురించి ఇంతకాలం తెలియనందుకు నిజంగా సిగ్గుపడ్డాను. ప్రస్తుతం పాఠకులను అందుబాటులో లేని ఈ పుస్తకాన్ని డా. ఎం. హరికిషన్ పునర్ముద్రిస్తున్నాడని తెలిసి సంతోషపడ్డాను. నాలాంటివాళ్ళు ఎందరో ఈ పుస్తకం ద్వారా ఆయన గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది, మన జిల్లాకు చెందిన రాజకీయ నాయకులలో ఇలాంటి నిరాడంబర, నిస్వార్ధ నాయకులున్నారనే విషయం తెలుస్తుంది కదాని సంబరపడ్డాను. 'ఈ పుస్తకానికి పరిచయ వాక్యాలు రాస్తావా' అని హరికిషన్ అడిగినప్పుడు నా సంబరం రెట్టింపయింది. ఎక్కడో నాకు, గామాగో గారికి కొన్ని విషయాలలో, కొన్ని ఆలోచనలలో సారూప్యం ఉంది అని నమ్మిన నాకు ఈ అవకాశం మరింత ఉత్సాహాన్ని కలిగించింది. ఆ మహోన్నత వ్యక్తిత్వాన్ని, ఆచరణవాదిని గురించి రాయడమంటే కొండని అద్దంలో చూపే ప్రయత్నమే. ఆ అమావాస్య చంద్రునికో నూలుపోగులాగా ఆయన మీద గౌరవంతో, అభిమానంతో ఈ నాలుగు మాటలు రాయడానికి సాహసిస్తున్నాను........................................