ప్రవేశిక
ప్రాయ ఇతి శబ్దేన దోషసంపాదనం చిత్త మితి |
శాస్త్ర ప్రతిషేధః తస్మా తాయ శ్చిత్తమిత్యాచ్యతే ॥
భావం: అంటే దోషసంపాదనమని, చిత్తం అంటే దాన్ని నివారించుకోవడమని అర్థం. ప్రాయశ్చిత్తమంటే దోషాన్ని నివారించుకోడానికి చేసే కార్యక్రమమని అర్థం.
* * *
అదో నాలుగు నిట్రాళ్ళ ఇల్లు. బయట 'వరదానం, ఆయుర్వేదాచారి' అనే బోర్డుంది. ఆ ఇంట్లోని వెనక పెద్ద గది వంటగది. ఓవైపు నేల మీద పొయ్యి. మరోవైపు ధాన్యం బస్తాలు. మధ్య గదిలో ఓవైపు ఉయ్యాలబల్ల. మరోవైపు అతిధులు వస్తే పరచటానికి నాలుగు చాపలు. ఆ ఇంట్లో మరో రెండు గదులున్నాయి. వాటిలో ఒకదాన్నిండా ఆయుర్వేద మందులు, చిన్న మేజా బల్ల, కుర్చీ, వచ్చిన రోగులు కూర్చోడానికో బల్ల ఉన్నాయి. ఇంకో గది ఎత్తైన పందిరిపట్టెమంచం గల పడకగది.
ఆ ఇంటి వెనకాల చాలా చెట్లున్నాయి. అవన్నీ ఔషధగుణాలు గల చెట్లే. నూతి గట్టు పక్కన స్నానానికి చుట్టూ దడి కట్టిన చిన్న పందిరి. దూరంగా వెనకో మరుగుదొడ్డి. ఆ ఇంటిముందో ఎడ్లబండి ఆగింది. అందులోంచి దిగిన ఇద్దరు ఓ రోగిని చేతులు పట్టుకుని కిందకి దించారు. ఆయన కడుపునొప్పితో బాధ పడుతున్నాడు. ఆ ఇంటి అరుగు మీద కళ్ళుమూసుకుని కూర్చున్న పండితయ్య ఆ రోగి వంక చూడలేదు. ఎనభై పైబడ్డ...................