మానవ సంబంధాలకు అద్దం పట్టిన కథలు
విస్తృతంగా నవలలూ కథలూ రాయడంలోనే కాకుండా, నాటిక, కవితా
ప్రక్రియలలో కూడా తన ప్రతిభని ప్రదర్శించిన ప్రముఖ రచయిత సింహప్రసాద్. “వివాహవేదం" అనే "హిందూ వివాహం, మరియు జీవన విధానాల, జీవిత విశిష్ఠతల విజ్ఞాన సర్వస్వం' అనే అనితరసాధ్యమైన గ్రంథ రచన చేశారు.
'ఇంతకు ముందు 'వెళ్ళు', 'బోన్సాయ్ మనుషులు' కథా సంపుటాలు వెలువరించిన తరువాత, రచయిత ఇప్పుడు వెలుగులోకి తెస్తున్న 'విశ్వమానవుడు' ఒక ప్రత్యేకతతో కూడిన కథా సంపుటి. ఇందులోని కథలన్నీ విశిష్ట కథల పోటీల్లో బహుమతులు పొందినవే. 'ఉత్తమ', 'ప్రథమ', 'ద్వితీయ' వంటి వర్గీకరణ సంగతి ఎలా ఉన్నా, అన్నీ మంచి కథలుగా ముద్రవేసుకున్నవే. అందుకే ఏదో ఒక బహుమతికి అర్హత పొందాయి. బహుమతులు పొందిన కథల్ని విడిగా ఒక సంపుటిగా తేవడం అరుదుగా జరుగుతుంది. పైగా, ఈ కథలు 2009 నుంచి 2010 వరకూ బహుమతులు పొందిన కథలు కావడం మరీ విశేషం! వీటిలో రెండు హాస్యకథల పోటీల్లో బహుమతి పొందినవి.
ఉత్తమ కథగా బహుమతి పొందిన కథల్లో ఒకటి 'రియాల్టీషో', మనలో కొందరికి 'సినిమా తారల పిచ్చి' ఎంతగా వ్యాపించిందో, అది ఎంత వరకూ దారి తీస్తోందో వ్యంగ్యంగా చిత్రించిన కథ ఇది. సినిమాల గురించి పత్రికల్లోనూ, టి.వి. ఛానల్స్లోనూ చేస్తున్న ప్రచారం గురించి చెప్పనక్కర్లేదు! ఈ ప్రచారం కోసం సినిమాతారలు కొందరు ఎటువంటి ప్రయోగాలైనా చేసి కొందరిని ఎలా వెర్రివాళ్ళని చేస్తారో చూపిస్తారు ఈ కథలో. ఒక సినిమా తార స్వయంవరం ప్రకటించి, రకరకాల పరీక్షలు పెట్టి, చివరికి నెగ్గిన వాడికి వరమాల వేసి, తీరా పెళ్ళి మాట ఎత్తేసరికి, “అదంతా నిజమనుకుంటున్నావా పిచ్చోడా, డ్రామా!" అని "పడీపడీ" నవ్వుతుంది. కథానాయకుడు వెర్రినవ్వు నవ్వి చివరికి పిచ్చివాడై పోతాడు. నిజానికి అంతమంది సాక్షులున్నారు కాబట్టి పరువు నష్టం దావా వెయ్యొచ్చు. కానీ సామాన్యుడికి ఆర్థికంగా కేసు నెగ్గే స్తోమత ఉండాలి. కదా! 'ఎస్ ఎమ్ ఎస్'లు తెప్పించుకుని ప్రథమ స్థానాన్ని పొందడం టి.వి. ఛానల్స్ నిర్వహించే పోటీల్లో మనం చూస్తూంటాం. దానిపైన కూడా సింహప్రసాద్ ఈ రూపంలో ఒక వ్యంగ్యాస్త్రాన్ని విసిరారు!.......................