ఎకరం భూమి
ఏడాది తర్వాత బొంబాయి నుంచి ఇంటికి వచ్చిన బాలయ్యను చూద్దామని వచ్చాడు నారాయణ. అసలే బక్కగా కట్టెపుల్ల లెక్క ఉండే బాలయ్య మరీ బక్కగా చీపురు పుల్ల లెక్క మారడం చూసి ఆశ్చర్యపోయాడు. ఇద్దరు మాటల్లో ఉండగా తలుపు చప్పుడైంది. ఎవరా అని అటు దిక్కు చూశారు. ఎదురుగా ఎల్లం.
బాలయ్యకు ఓ కాగితం ముక్క ఇచ్చి “ఇంతకు ముందు మాట్లాడినప్పుడు నా అడ్రస్ ఇచ్చుడు మరచిపోయిన. సిరిసిల్లలోనే ఉంట. ఒప్పుకుంటే వచ్చి చెప్పు. రెండు లక్షలిత్త..." అంటూ వెళ్ళిపోయాడు.
రెండు లక్షలనంగనే ఉలిక్కిపడ్డాడు నారాయణ.
“ఒరే బాలుగా...ఒప్పుకోరా. రెండు లక్షలంటే మాటలా... నీ బతుకే మారిపోతది. అప్పులన్ని తీరిపోతాయి. నీ దరిద్రమే పోతది” అన్నాడు. బాలయ్య విననట్టె చూశాడు.
“ఇంతకు ఎవలురా వాళ్లు, రూపాయి నెత్తిమీద పెట్టినా ఆరాణకు కొరగాని నీకు అంతడబ్బు ఎందుకిత్తనంటున్నరు...” అడిగాడు నారాయణ.
బాలయ్య చిన్నగా నవ్వి “ఏం జరిగిందో చెప్పుత. నువ్వైతే ఏం చేస్తవో చెప్పు" అన్నాడు.
“అరే జెట్టన చెప్పురా....నువ్వు వద్దంటె నేను పోత " ఆతృతగా అన్నాడు.........................