వివాహ దీపిక
జ్యోతిష ఉపోద్ఘాతము
మానవ విజ్ఞాన సర్వస్వం వేదం. వేద వాఙ్మయంలో జ్యోతిష శాస్త్రము మకుటాయమానమైనది. విజ్ఞానమెంత వికసించిన భూత భవిష్యత్ వర్తమానములకు జ్యోతిష శాస్త్రము మార్గదర్శకమైనది. సకల చరాచర సృష్టి యావత్తు ఏదో ఒక అజ్ఞాత శక్తికి లోబడి ఉంది. సృష్టి స్థితి లయ కారకత్వములు భగవాదాధీనములైనవి.
ఈ సృష్టిలో జలచర భూచర ప్రకృతియందలి సమస్త ప్రాణకోటి యంతయు పరబ్రహ్మ నిర్ణయమైనది. మన మహర్షుల తపో ప్రభావము చేత గ్రహించి వేద వేదాంగములు మనకు అందించినారు.
శ్లో॥ శిక్షావ్యాకరణః ఛందో నిరుక్తం జ్యోతిషం తథా!
కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణః
ఈ షడంగములలో జ్యోతిషశాస్త్రము ఒకటై ఉన్నది. అందుచే జ్యోతిషశాస్త్రము ముఖ్యమైనది. ఈ జ్యోతిషశాస్త్రము.
శ్లో॥ యథాశిఖ యయూరాణాం నాగానం మణయో యథా |
తత్తద్వేదాంగా శాస్త్రాణాం జ్యోతిషం మూర్ధని స్థితం
నెమళ్ళకు శిఖలాగా నాగులకు మణిలాగా వేదశాస్త్రాలకు జ్యోతిషం తలమానికమైనది. అని వేదాంగ జ్యోతిషంలో చెప్పబడినది.
మరియు
శ్లో॥ సర్వేంద్రియాణాం నయనం ప్రధానం ।
షట్శాస్త్రాణాం జ్యోతిషం ప్రధానం ॥