కరువు నేల కష్ట నిష్టూరాల
ప్రతిభావంతమైన అభివ్యక్తీకరణ
-కుం.వీ.
ప్రఖ్యాత కన్నడ సాహితీవేత్త
ఈ కథల నేపథ్యంలోని రాయలసీమ ప్రాంతాలైన కర్నూలు, ఎమ్మిగనూరులు నాకు సుపరిచితాలు. రాయలసీమలోని నాలుగు జిల్లాలలో నేను విస్తృతంగా తిరిగాను. ఈ ప్రాంతపు భూస్వాముల దురాగతాలను మూడున్నర దశాబ్దాలపాటు ప్రత్యక్షంగా చూశాను. ఈ ప్రాంతపు కుగ్రామాల దుస్థితి గురించి కూడా నాకు బాగా తెలుసు. అయితే ఈ ప్రాంతప్రజల జీవనస్ఫూర్తి నన్ను ఆశ్చర్యపరిచింది. ఇక్కడి పేదరికం గురించి, భూస్వాముల దౌర్జన్యాలకు సంబంధించిన కథలను, నవలలను నేను చదివి ప్రభావితుడను అయ్యాను.
కన్నడ సాహిత్యంలోని ప్రామాణిక గ్రంధమైన “కవిరాజ మార్గం"లో గ్రంథకర్త శ్రీవిజయ కన్నడ భాషను అనేక కన్నడలుగా విభజించారు. ఈరకమైన విభజన అవిభక్తమైన విశాల ఆంద్రప్రదేశ్ కు కూడా వర్తిస్తుంది. కోస్తాంధ్ర తెలుగు, కృష్ణా, గోదావరి నదీతీర ప్రాంతాలలో ఉన్న తెలుగు, తెలంగాణాప్రాంత తెలుగు, ఉత్తరాంధ్ర తెలుగు, రాయలసీమ తెలుగు వంటి అనేక రకాల తెలుగు మాండలికాల సమ్మేళనమే..........