పిరదౌసి కావ్యానుశీలనం
ప్రాచీన తెలుగు సాహిత్యంలో మహాకవి పోతనతో పోల్చదగ్గ ఆధునిక కవి గుర్రం జాషువా. పోతన ఏ రాజకీయాల ప్రమేయం లేకుండా, మత ఉద్యమాల ప్రభావం లేకుండా స్వతహాగా శైవుడై వైష్ణవ గాథలు రాసాడు.
చేతులారంగ శివుని పుజించడేని' అన్న సులభ సుందరమైన గీతమూ, 'ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీ'డన్న ఆచ్చికమూ, 'క్షోణీతలమ్ము నన్నెదురుసోకగ మ్రొక్కి నుతింతు'నన్న సంస్కృత పదభూయిష్టమైన పద్యమూ అలవోకగా చెప్పి ప్రజల నాల్కల మీద చిరకాలం నిలిచిపోయాడు పోతన. 'వాని రెక్కల కష్టంబు లేని నాడు సస్యరమ పండి పులకింప సంశయించు' అన్న సులభ సుందరమైన గీతమూ, 'రాజు మరణించె నొక తార రాలి పోయె, కవియు మరణించె నొక తార గగనమెక్కె' అన్న సంస్కృతాంధ్రాల మేలి కలయిక, 'నా కవితా వధూటి వదనమ్ము నెగాదిగ జూచి' అన్న పద్య గాంభీర్యమూ చూపించి సామాన్యుల మనస్సులో నిలిచిపోయాడు జాషువా.
జాషువా కులం వల్లనో, వంశ ప్రతిష్ట వల్లనో కాక తన వాక్పటిమ వల్ల గుర్తించబడ్డాడు. ఉద్యమాల వల్లనో, రాజకీయాల వల్లనో కాక కరుణ రస హృదయం వల్ల కవితాపతాక నెగురవేసాడు. 'నాల్గు పడగల హైందవ నాగరాజు' బుసల నడుమ స్వశక్తితో ఎదిగాడు. అయినా తనను చిన్న చూపు చూసిన అవ్యవస్థ పట్ల తాను ప్రేమ దృష్టినే ప్రదర్శించాడు. తనను అనేక ఇబ్బందులకు గురి చేసిన కన్న ఊరిని, 'నను మరచిన నిను మరువను, వినుకొండా నీకు నా పవిత్ర ప్రణతుల్' అని ప్రస్తుతించాడు.................