వెన్నెల చల్లగానూ లేదు, వేడిగానూ లేదు. వెన్నెల జలదరింపుగా ఉంది. నొప్పిగా ఉంది. గాయంగా ఉంది... దుఃఖం దుఃఖంగా ఉంది. కన్నీళ్లు కూడా నొప్పిగా ఉన్నాయి. మెదడంతా పచ్చి పుండై నొప్పిని నరనరంలో పాకిస్తుంటే కన్నీరు హృదయంలోకి, చర్మం మీద ఇంకిపోతూ దేహం నొప్పితో ముడుచుకు పోతున్నది...
కన్నీరెందుకు... ఈ నొప్పీ ఎందుకు మరి? నీ కోసమా బిపిన్... తెలీదు. ఈ అవమానం జరిగినందుకా... ఆడదాన్నైనందుకు... లేదా ఆడదాని దేహం నాకున్నందుకా ఇలాంటి గాయం? నాకేనా... ఒక్క నాకేనా. అందరికీనా... ఆడవాళ్ళందరికీనా లేదా కొందరు ఆడవాళ్లకేనా? నువ్వెందుకో బాగా గుర్తుకు వస్తున్నావు. నదికి సముద్రం జ్ఞాపకం వచ్చినట్లు, పూలకు తనని పట్టించుకోకుండా తన పక్కనించే వెళ్లిపోయిన చిరుగాలి జ్ఞాపకం వచ్చినట్లు, మండే ఎడారికి వానజల్లు జ్ఞాపకం వచ్చినట్లు, ఆకలేసిన పాపాయికి తల్లి పాల పరిమళం జ్ఞాపకానికి వచ్చినట్లు, నాకు... నా బిపిన్ చంద్రా నువ్వే జ్ఞాపకం వస్తున్నావెందుకు? నా గాయం మాన్పే మందువనా నువ్వు. ఎందుకు మరి? నిన్ను కోల్పోయినందుకా... లేక నా జీవితం ఇలా అగాధంలో పడిపోతున్నందుకా... ఎందుకు...? నేను తీసుకున్న నిర్ణయం సరైంది కానందుకా? ఎంత నమ్మకమో కదా నీకు నా మీద. అది పూర్తిగా ధ్వంసం................