మా వూరు
నేను మా వూరు వదలిపెట్టి యాభై అయిదేండ్లు అయ్యింది. మా అయ్య, అమ్మ వున్నంత కాలం అప్పుడప్పుడు పోయి వస్తుండేవాణ్ణి. మా అన్నలు బతుకు దెరువు కొరకు వూరొదిలి పెట్టి దేశానికొకరయిండ్రు. ఒక నెలలోపులోనే మా అయ్య, అమ్మ కాలం చేసిండ్రు. ఆ బజారు పాడుబడి పోయింది. అప్పట్లో అన్ని కులాలోల్లు వరుసలుబెట్టి 'అన్నా, అక్కా, వదినా, చిన్నాయనా, పెదనాయనా, కొడకా, మనుమడా' అంటూ పిల్చుకుంటుండిరి.
నేను నౌకరి చేసే నల్లగొండలోనే వుంటూ పిల్లల చదివించుకుంటూ వుంటి. అక్కడే ఇల్లు కట్టుకున్న. నన్ను చూసి మా అన్నకొడ్కులు కూడా నల్లగొండలోనే ఇల్లు కట్టుకొని వుండబట్టిండ్రు. మా అన్న వున్నంత వరకు మా వూరిలోనే వుండిపోయిండు. ఆయన కాలం చేసిన తర్వాత పిల్లలు ఆ ఇల్లు అమ్మిండ్రు. కాని, మా అయ్య సంపాదించిన ఒక ఎకరం భూమి పొత్తులో వుండిపోయింది. అది చౌటపొలం. చెర్వు నిండితేనే పంట పండుద్ది. కాలం కాక ఈ పదేండ్ల నుండి అది పడవ పడిపోయింది. అంతకుముందు కాలం అయితే పక్క పొలమాయినే సేద్యం చేసి ఎంతో కొంత ఇస్తుండేది. మా అన్న బతికున్నంత కాలం నేనక్కడికి పోకపోతుంది....................