'యోధ'ల జీవన పోరాటం...
మాతృత్వం గురించిన కథల గురించి ఒక కథా సంకలనం తీసుకు రావాలనుకుంటున్నామని విజయ చెప్పినపుడు ఆశ్చర్యము, ఆనందము, ఆందోళన కూడా కలిగాయి. ఆశ్చర్యం ఎందుకంటే ఇన్నాళ్ళకు మాతృత్వం అనేది ఒక కాంసెప్ట్, భావనగా రచయిత్రులు గుర్తించి దానిని గురించి సంకలనం తేవటం గురించి. ఆ విషయ ప్రాధాన్యత గుర్తించినందుకు ఆనందం. ఐతే ఆ భావనలోని సంక్లిష్టత్వాన్ని, ఆ భావజాలం తనలో పొదువుకున్న అనేకానేక చిక్కుముడులను ఎంతవరకు అర్ధం చేసుకోగలుగుతారనే ఆందోళన కలిగింది. కానీ ఒకసెంటిమెంటల్ పరిధిలో కాకుండా, కవులందరూ గానం చే సే వందన గీతాల్లాం కాకుండా స్త్రీలు తమ అనుభవాల్లోంచి ఈ కథలు రాయగలరనే నమ్మకం కలిగింది. మాతృత్వ భావజాలం గురించి విజయ, మరికొందరు మిత్రులు కలిసి ఒక వర్క్షాప్లగా పెట్టి చర్చించారు. అందులో నేనూ మాట్లాడాను. చాలా కృషి జరిగిన తర్వాతనే ఈ పుస్తకం వస్తున్నది. అందుకు సంతోషం.
ఈ సమాజంలో ఆడవాళ్ళు పునరుత్పత్తి కోసమే ఉన్నారు. ఆడవాళ్ళు పిల్లల్ని కని తీరాలనే, రాయని శాసనం చాలా కఠినంగా అమలులో ఉంది. స్త్రీల కోసం స్త్రీల బాగుకోసం చేసిన చట్టాలు ఎన్నడూ అమలు కావు. కానీ చట్టరూపం దాల్చని వివాహం, లైంగికత్వం, మాతృత్వం వంటి భావజాలాలు తిరుగులేకుండా అమలవుతుంటాయి. ఏ సమాజంలోనూ స్త్రీలకు ఎంతమంది పిల్లలను కనాలి, ఎప్పుడు కనాలి, ఎవరికి కనాలి, గర్భనిరోధ సాధనాలు వాడొచ్చా,....................