మీరు అందరిలాగా కాదు
తమ దేహంలో, మనసులో, హృదయంలో, ఆత్మలో పూర్తి సామర్థ్యాల వికాసమే ఎవరికైనా వారి జీవితాశయం కావాలి.
ఎలక్ట్రిక్ బల్బులు చూసినప్పుడు మన ఆలోచనలు వాటిని కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ వైపు మళ్ళడం సహజం, ఆయన విద్యుద్దీపాల్నీ, విద్యుద్దీప వ్యవస్థనీ కనుగొన్నవాడు. మన ఇంటిమీద ఆకాశంలో విమానం వెళ్తున్న చప్పుడు వినగానే మన మదిలో రైట్ సోదరులు మెదుల్తారు. వారు తమ ప్రాణాల్ని పణంగా పెట్టారు. కాబట్టే నేడు మనిషి గగనవిహారం చెయ్యగలుగుతున్నాడు. టెలిఫోన్ చప్పుడు వినగానే మనకు అలెగ్జాండర్ గ్రాహంబెల్ గుర్తొస్తాడు. సముద్ర ప్రయాణమంటే తక్కినవారికి ఒక వింత అనుభవమో, సుదూరపయనమో కాగా, ఒక అద్వితీయ వ్యక్తి, తాను యునైటెడ్ కింగ్డమ్ నుంచి భారతదేశానికి ప్రయాణిస్తున్నంతసేపూ, నింగీ, కడలీ కలుసుకునే దిగంతరేఖ దగ్గర నీలంగా ఎందుకు కనిపిస్తున్నదనే ఆలోచిస్తూ ఉన్నాడు. అక్కడితో ఆగకుండా, ఆ దృగ్విషయాన్ని మరింత లోతుగా పరిశోధించాడు. కాంతి వికీర్ణం కావడమే దానికి కారణమని తేల్చాడు. దాంతో ఆ అద్వితీయ వైజ్ఞానికుడు నోబెల్ పురస్కారం అందుకున్నాడు. 20వ శతాబ్దంలో ఈ ప్రపంచం అదృష్టం కొద్దీ మహాత్మా గాంధి అనే నాయకుడు లభించాడు. మన జాతిపిత మనకి స్వాతంత్య్రం సాధించిపెట్టడమే కాదు, దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష అంతం కావడానికి మార్గం సుగమం చేసాడు కూడా. ఒక మహిళా శాస్త్రవేత్త రెండు సార్లు నోబెల్ పురస్కారం దక్కించుకుంది, 1903 లో ఒకసారి, 1911 లో మరొకసారి. మొదటిసారి రేడియంని కనుగొన్నందుకు................