ఆత్మ పరిమళం
అయమాత్మా బ్రహ్మ అనేది అథర్వణవేదంలోని మహావాక్యం. మనలోని ఆత్మయే బ్రహ్మ అని అర్ధం. ఈ ఆత్మయే సత్యం. నిత్యం, భవ్యం, దివ్యం, రమ్యం. గమ్యం. అతుల్యం. దాని పరిమళాలు అవిచ్ఛిన్నం. అనంతం. అప్రమేయం. వాటిని ఆఘ్రాణించాలి. ఆత్మతత్త్వమే వేదాంతశిఖరం. పరమాత్మ ప్రతిబింబం. ఆ ఆత్మచింతన చేయాలి. అది మన కర్తవ్యం.
ఇరవైనాలుగు తత్త్వాలతో జన్మించిన మానవుడు 25వ తత్త్వమైన ఆత్మను తెలుసుకోవాలి. తరతి శోకమ్ ఆత్మవిత్ ఆత్మను తెలుసుకొనువాడు శోకమును దాటును. శోకమనగా పుట్టుక, మరణము రెండూ కల జన్మ పరంపర. ఆత్మను గురించి తెలుసుకుంటే సంసార దుఃఖం సమసిపోతుంది. దానికి మార్గాన్ని ఆదిశంకరులు నిర్వాణషట్కం రూపంలో మనకు అందించారు.
ఆదిశంకర భగవత్పాదుల గళనినాదం శివోహమ్. సర్వజన నైవేద్యం. ఆత్మజ్ఞానం ఆర్జించి, అనుభవించి, జన్మరాహిత్యం పొందడానికి నిర్వాణషట్కమే సోపానము, సులభము, సూక్ష్మము. ఇదే ఉపాసన, సాధన, మంత్రజపం, తపం. గురూపదేశాన్ని పొంది శ్వాసల రాకపోకల గమనించడమే సాధన. ఈ మార్గంలో ఓమ్, స్కో హమ్, శివోహమ్ ఈ మూడూ వేటికవే.
సృష్టి సమస్తం 84 లక్షల జీవరాశులతో నిండివుంది. జీవునికి సరిగ్గా అన్ని జన్మల తరువాత మానవ జన్మ లభిస్తుంది. దేవతల జన్మ, రాక్షస జన్మ వంటివి కర్మఫలానుభవంతో పూర్తవుతాయి. కానీ మానవునికి ఒక్కనికే మోక్షాన్ని సాధించే బంగారు అవకాశం ఉంది. మనకే ఈ అదృష్టం. కానీ, మనం పరిమితమైన కొలపాత్ర వంటి శరీరం గలవాళ్ళం. ఇది ఆత్మకాదు.
దేహం నశ్వరం. దీని ఆనందాలు క్షణభంగురాలు. అనుభవించగానే ఉపశమిస్తాయి. మరలా నిద్రలేపుతాయి. ఆరాటం పోరాటం కలిగిస్తాయి....................