శ్రీ కార్తిక స్నాన సంకల్పః
కార్తీక సమో మాసః అని ఆర్యోక్తి
కార్తిక మాసంతో సమానమైన నెల లేదని అర్థం. ఈ నెలలో చేసే భగవదారాధన, సూర్యోదయానికి ముందే చేసే స్నానం ; జపాలు, అభిషేకాలు విశేష ఫలితాలనిస్తాయి.
కార్తికంలో స్నానం : ముందు కాలకృత్యాలు తీర్చుకొని, ఇంట్లో స్నానం చేసి, తర్వాత నదీస్నానమో, వీలుకాకపోతే చెరువులోనో, కొలనులోనో స్నానం చేయాలి.
సంకల్పం : నేను చేసుకున్న ఈ జన్మలోని పాపం, గత జన్మలోని పాపం నశించడానికి, తెలిసీ తెలియక చేసిన పాపాలు పోవడానికి, ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేవి సిద్ధించడానికి, నా క్షేమం, ధైర్యం, ఆయుష్షు, ఆరోగ్యం బాగుండడానికి, పెరగడానికి, శివ, కేశవుల అనుగ్రహం సిద్ధించడానికి కార్తిక స్నానం చేస్తున్నాను అని చెప్పుకుని స్నానం చేస్తున్న రోజున ఉన్న తిథి, మీ గోత్రం, మీ పేరు చెప్పుకోవాలి.
మంత్రం : "తులారాశింగతే సూర్యే, గంగా త్రైలోక్యపావనీ
సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణా భవేత్తదా "
అని చెబుతూ ప్రవాహానికి ఎదురుగానూ, వాలుగానూ నించుని, కుడిచేతి బొటనవ్రేలితో నీటిని నెత్తిన జల్లుకోవాలి. 3 దోసిళ్ళ నీరు ఒడ్డుకు జల్లాలి. తర్వాత తల తడిసేట్లుగా మూడు మునకలు వేయాలి. ఒడ్డునకు వచ్చి, కట్టుకున్న బట్టల 14 కొనలను నీరు కారేలా పిండాలి. ఇలా నీరు పిండడాన్నే యమతర్పణం అంటారు. తర్వాత తడి వస్త్రాలు వదిలివేసి, పొడి వస్త్రాలు కట్టుకుని, దగ్గరలోని శివాలయానికో, విష్ణు ఆలయానికో వెళ్ళి, స్వామి దర్శనం చేసుకోవాలి. ఆవునేతితో దీపారాధన చేయాలి. స్త్రీలు తులసిమొక్కను, దీపాన్ని వుంచి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. మగవారు కాయలు ఉన్న ఉసిరి కొమ్మను, దీపాన్నీ దానం ఇవ్వాలి...................