కీకారణ్యంలో జింక
- నీల్ కమల్ బ్రహ్మ
శర్మిళ ఈపాటికే ఆ కథ చదివేసి ఉంటుంది. ఆమెకు పత్రికలు చదవడం చాలా ఇష్టం. ఒక్కసారి పుస్తకం చేతిలోకి తీసుకుందంటే, అన్నం నిద్ర కూడా మరిచిపోతుంది. కానీ, ప్రస్తుతం ఆమె మనసులో ఏముందో నాకు అస్సలు అర్థం కావడం లేదు.
ఆమె గురించే ఆలోచిస్తూ సత్య అప్పుడే ఇస్త్రీ చేసిన కుర్తా వేసుకున్నాడు. అది బాగుందో లేదోనని అద్దంలో ముందూ వెనుక తిరుగుతూ చూసుకున్నాడు. కుర్తా తల పైనుంచి వేసుకునేటప్పుడు జుట్టు కాస్త చిందరవందరయింది. దాంతో మళ్లీ అద్దం ముందు నిలబడి, దువ్వెనతో తల దువ్వుకుని, ఇంకోసారి తనివితీరా చూసుకున్నాడు. దుస్తులు వేసుకోవడం పూర్తయ్యాక, చేతి రుమాలు తీసుకుని, దానికి తాను ప్యారిస్లో కొన్న సెంట్ రాశాడు. ఆ రుమాలును బయటికి కనిపించేలా తన పారదర్శక కుర్తా జేబులో పెట్టుకున్నాడు.
“ఇంకా ఏమైనా మర్చిపోయానా?” అని అనుకుంటూ, నిన్ననే కొన్న “ఓరోర్ని 'శర్మిళ లైజమ్" పత్రికను చేతిలోకి తీసుకున్నాడు. దాని పేజీలు తిరగేస్తూ ఈ పత్రికలోని విషయాలను అర్థం చేసుకోగలదా? ఒకవేళ ఆమెకు అర్థం కాకపోతే నేనే దగ్గరుండి వివరించాలి,' అని మనసులో అనుకున్నాడు సత్య.
సత్య రాసిన కథలు బోడో సాహిత్య ప్రపంచంలో ఒక సరికొత్త ఒరవడిని సృష్టించాయి. బోడో భాషలో అత్యుత్తమ రచనలు ఎలా చేయాలి, బోడో సమాజపు మూలాలను కథల్లో ఎలా ప్రతిబింబించాలి అనేది సత్య ప్రపంచానికి నిరూపించాడు. ఆ రచనలు ఇతర భాషా సాహిత్యాలతో పోటీపడే స్థాయిలో నిలిచాయి. నిజంగా అతనికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సత్య రచనలు చదవడం అంటే పాఠకులు సైతం............................