మలత్యా. టర్కీలోని ఓ అందమైన చిన్న గ్రామం. సకమత్ పుట్టి పెరిగిన ఊరు. అంత పెద్దవాడు కాదు, అలా అని చిన్నవాడూ కాదు. మనసు నిండా రంగులు నింపుకున్న చిత్రకారుడు. అతని చుట్టూ ఎప్పుడూ మనుషులుంటారు. అందరితోనూ సందడిగా కలిసి తిరుగుతూనే, ఒంటరితనపు మాధుర్యాన్ని ఆస్వాదించగల వ్యక్తి. తనదంటూ ఓ ప్రపంచాన్ని తన చుట్టూ చిత్రించుకుని ఆ ప్రపంచమంతటా తనే నిండిపోయి వుంటాడు. ఎప్పుడూ ఎవరికీ అర్థం కాడు.
రాళ్ళు గుట్టలుగా ఉండే మలత్యా అంత అందంగా ఏమీ ఉండదు. కానీ సకమత్ తన కళతో మలత్యాను నందనవనంలా చిత్రించాడు. ప్రపంచంలో మీరు ఏ మూలనున్నా అతని పెయింటింగులు చూశాక, ఈ మలత్యా ఎక్కడుందో కనుక్కొని, ఒక్కసారైనా వెళ్ళి చూడాలని అనుకుని తీరతారు.
ఆ చుట్టుపక్కల పెద్దపెద్ద వ్యాపారస్తులు, డబ్బున్నవాళ్ళు సకమన్ను తమ ఇళ్ళకు పిలిపించుకుని, నిలువెత్తు వర్ణచిత్రాలు వేయించుకుని, తమ రూపానికి శాశ్వతత్వం కల్పించుకుంటారు. కొన్ని వందల ఏళ్ళ పాటు తమ తర్వాతి తరాలు చూసి, గర్వంతో పొంగిపోయేలా ఉంటాయా వర్ణచిత్రాలు.
అసలెవరూ పిలవకపోయినా సకమత్ తనకోసం తాను ఎప్పుడూ బొమ్మలు గీస్తూనే ఉంటాడు. అతనికి అదే జీవితం, అదే శ్వాస. జీవితపు ప్రతి క్షణంలో, తన ప్రతి రక్తపుబొట్టులో వేళ్ళనే కుంచెలుగా ముంచి, అనుక్షణం మరో రసరమ్యసృష్టికి ప్రాణం పోస్తూనే ఉంటాడు.........................