|
ఎందుకు చేసేను? ఎ.వి. రమణమూర్తి 1979 చివర్లో అనుకుంటాను ఖమ్మంలో ఓరాత్రి భోజనం అనంతరం ఢిల్లీ కొట్టుకి దారితీస్తున్న మా అన్నయ్య శాస్త్రి, కిల్లీకొట్టుకి నాలుగడుగుల దూరంలోనే ఆగిపోయి, నిలబడి, "ఒరే! కవీ! కిల్లీకొట్టు నిర్మించరా!" అన్నాడు. అని, ఆనక ఓ రెండు మూడు నిమిషాలపాటు ఒక పెద్దపేరాని నాటకీయంగా అప్పజెప్పాడు. అంతకుమునుపు అప్పుడప్పుడు, "కాముని విరిశరములబారికి నే, నేమని సహింతునే, చెలి, యేమని సహింతునే?..." అంటూ వాడు చేసే తమాషా అభినయాలు నాకు అలవాటే కాబట్టి, ఇదికూడా అలాంటిదేదో అయివుంటుందని అనుకున్నాను. రెండునిమిషాలపాటు గడగడా కిల్లీ కొట్టు వర్ణన చేసి, అక్కడికి ఆపి, "అబ్బబ్బ! ఏం రాస్తాడ్రా రావిశాస్త్రి!" అన్నాడు. అప్పటికి నేను రాచకొండ విశ్వనాథశాస్త్రి అనే పేరు లీలగా వినివున్నప్పటికీ, ఆ పేరునిబట్టి ఆయనేదో ప్రబంధకవుల కోవకి చెందినవాడనే అభిప్రాయం - ఏవీ చదవని పదిహేడేళ్ల కుర్రాళ్లకి మామూలుగా ఉన్నట్టుగానే నాకూ ఉండేది. రావిశాస్త్రిగారిని గురించి ఆనాడు అప్పుడు నేను తెలుసుకున్నది అనంతరకాలంలో ఆయన్ని చదవడానికి పురికొల్పింది. రెండు మూడేళ్ల తర్వాత, ఉద్యోగజీవితపు తొలిరోజుల్లో కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లిలో ఉంటున్నప్పుడు, మిత్రుడు దుర్గాప్రసాద్ తో కలిసి లైబ్రరీలో 'రత్తాలు-రాంబాబు' మొదటిభాగం తీసుకున్నాను. ఇద్దరం కలిసి ఒకళ్ల తర్వాత ఒకరం ఆ భాగాన్ని ఎలా గబగబా చదివేశామో, అది పూర్తికాగానే హడావుడిగా వెళ్లి, రెండోభాగం, ఆతర్వాత మూడోభాగం తెచ్చుకుని ఎలా ఆత్రంగా చదివేశామో నాకిప్పటికీ వివరంగా గుర్తుంది! అనంతరకాలంలో రావిశాస్త్రిగారి రచనలు అడపాదడపా చదువుతూనే ఉన్నప్పటికీ, అవన్నీ ఎందుకో చదవాల్సిన క్రమంలో చదవలేదనిపించింది. మనసు ఫౌండేషన్ ప్రచురించిన 'రచనా సాగరం' చూశాక, ఆయన రాసినవి సరీగ్గా చదవడం మాట అటుంచి, అసలు ఎంత తక్కువ చదివానో కూడా అర్థమైంది. రావిశాస్త్రిగారి రచనలన్నిటినీ పద్ధతిగా ఒకటికి రెండుసార్లు, రెండుకి నాలుగుసార్లు చదివాక, చదివిన వాటిల్లో ముఖ్యమైన వాక్యాల్నీ, రావిశాస్త్రిగారు ప్రతిభావంతంగా చేసిన వ్యక్తీకరణల్నీ, మాటల మెరుపుల్నీ, పదాల విరుపుల్నీ, వ్యంగ్యాల్నీ, హాస్యాల్నీ అన్నింటినీ, నేను మళ్లీ మళ్లీ చదువుకుందుకు వీలుగా భద్రపరుచుకుంటూ వచ్చాను. అవి చదువుకుంటున్న ప్రతిసారీ, మనకు మాత్రమే అనుభూత మయ్యే ఆనందం కొసరుగా అందించే అస్పష్టమైన బెంగ ఒకటి ఏదో అదనంగా కలిగేది. ఆ రచనా విశేషాలన్నీ ఎవరితోనైనా పంచుకోవాలన్న తహతహ మొదలయ్యేది. అందుకోసం వీటిని సామాజిక మాధ్యమాల్లో అప్పుడప్పుడూ పంచుకుంటూ వుండేవాడిని. అయితే, ఆ ప్రయత్నం సరిపోదనీ, రావిశాస్త్రి అనే మహారచయిత ప్రతిభ కొన్ని ఫేస్బుక్ పోస్టులకి మాత్రమే పరిమితమైనది కాదనీ, ఇవన్నీ అందరికీ............................. |